Pachuvum Athbutha Vilakkum Review: పచ్చువుమ్ అద్భుత విలక్కుమ్ మూవీ రివ్యూ - ఫహాద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీ ఎలా ఉందంటే?
29 May 2023, 11:00 IST
Pachuvum Athbutha Vilakkum Review: ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళ మూవీ పచ్చువుమ్ అద్భుత విలక్కుమ్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించాడు.
ఫహాద్ ఫాజిల్
Pachuvum Athbutha Vilakkum Review: మలయాళంలో ప్రయోగాలకు పెట్టింది పేరు ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil). స్టార్‌డమ్, హీరోయిజం హంగుల కంటే రియలిస్టిక్, హ్యూమన్ ఎమోషన్స్‌తో కూడిన కథలకే ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తాంటాడు. అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సినిమాలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన మలయాళ చిత్రం పచ్చువుమ్ అద్భుత విలక్కుమ్ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ (Amazonprime Video) ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాలో అంజనా జయప్రకాష్ హీరోయిన్‌గా నటించింది. కామెడీ లవ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? ఫహాద్ ఫాజిల్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని మెప్పించాడా ? లేదా అన్నది చూద్దాం.
ప్రశాంత్ కథ...
కేరళకు చెందిన ప్రశాంత్ (ఫహాద్ ఫాజిల్) ముంబయిలో ఓ ఆయుర్వేద మెడికల్ స్టోర్‌ను రన్ చేస్తుంటాడు. ముప్పై ఏళ్లు దాటిన పెళ్లికాదు. ప్రేమించిన అమ్మాయి అతడిని కాదని వెళ్లిపోతుంది. బిజినెస్ పనులతో పాటు తండ్రిని చూసేందుకు ప్రశాంత్ కేరళ వెళ్తాడు. పెళ్లి చూపుల వల్ల అతడు తిరిగి ముంబయి రావాల్సిన ఫ్టైట్ మిస్సవుతుంది.
మెడికల్ షాప్ బిల్డింగ్ ఓనర్, బిజినెస్‌మెన్ రియాజ్ (వినీత్) కేరళలో ఉన్న తన తల్లి లైలాను ముంబయికి ట్రైన్‌లో తీసుకురావాల్సిందిగా ప్రశాంత్‌ను సహాయం కోరతాడు. అందుకోసం ఐఫోన్ గిఫ్ట్‌గా ఇస్తానని అంటాడు. ఆ ఐఫోన్ కోసం లైలాతో కలిసి ముంబయి బయలుదేరుతాడు ప్రశాంత్.
కానీ లైలా మధ్యలోనే గోవాలోనే ట్రైన్ దిగిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ ప్రశాంత్ కూడా గోవాలో దిగిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రశాంత్‌తో కలిసి ముంబయి బయలుదేరిన లైలా గోవాలో ఎందుకు దిగింది? లైలా వెతుకుతున్న నిధి ఎవరు?
డబ్బు కోసం నిధిని లైలా వద్దకు చేర్చే బాధ్యతను చేపట్టిన ప్రశాంత్‌కు గోవాలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హంసధ్వనితో (అంజనా జయప్రకాష్) పరిచయం ప్రశాంత్ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? ఆమెను ప్రశాంత్ ప్రేమించాడా? నిధిని లైలా దగ్గరకు చేర్చాడా? లేదా? అన్నదే(Pachuvum Athbutha Vilakkum Review) ఈ సినిమా కథ.
కామెడీ, సెంటిమెంట్
సింపుల్ ఎమోషన్స్ తో కూడిన లవ్ డ్రామా మూవీగా పచ్చువుమ్ అద్భుత విలక్కుమ్ సినిమాను దర్శకుడు అఖిల్ సత్యన్ అద్భుతంగా తెరకెక్కించాడు. సంకుచిత భావాలతో ఆలోచించే ఓ యువకుడి నిజమైన ప్రేమ గొప్పతనాన్ని ఎలా తెలుసుకున్నాడు? స్వార్థం, ప్రతిఫలాపేక్షతో జీవించే అతడు ఏ విధంగా మంచివాడిగా మారాడన్నది లవ్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ మనసుల్ని కదిలించేలా ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్.
వినోదం ప్లస్...
ఈ సినిమాకు కామెడీ పెద్ద ప్లస్‌గా నిలిచింది. ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్స్, అతడి మేనరిజమ్స్ నుంచి ఫన్ చక్కగా వర్కవుట్ అయ్యింది. . ఆరంభంలోనే హిందీ భాష రాకపోవడంతో ప్రశాంత్ అసిస్టెంట్స్ పడే ఇబ్బందులు, డాక్టర్ ఇంట్లో వారికి ఎదురయ్యే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.
ప్రశాంత్, అతడి తండ్రికి మధ్య సీన్స్‌లోని కామెడీ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. లైలాతో కలిసి ప్రశాంత్ ముంబయికి ప్రయాణం కావడం ఆమె గోవాలో మిస్ అయ్యే సీన్‌తో కామెడీ సినిమా కాస్త అడ్వెంచరస్ మూవీగా మారిపోతుంది.
అడ్వెంచరస్ టర్న్...
గోవాలో చిక్కుకుపోయిన లైలాను తిరిగి ముంబయి తీసుకెళ్లడానికి ప్రశాంత్ చేసేప్రయత్నాలు చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. హంసధ్వనితో ప్రశాంత్ పరిచయం , వారి ప్రేమ సన్నివేశాల్లోని డ్రామాను అందంగా స్క్రీన్‌పై చూపించారు డైరెక్టర్.
ఫహాద్ ఫాజిల్, అంజనా జయప్రకాష్ కెమిస్ట్రీ, వారి లవ్ సీన్స్ ను రియలిస్టిక్‌గా రాసుకున్న విధానం బాగుంది. నిదానమే ఈ సినిమాకు మైనస్ అయ్యింది. కొన్ని సీన్స్‌ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఒక్క లోపం మినహా పెద్దగా సినిమాలో మైనస్‌లు లేవు.
ఫహాద్ ఫాజిల్ బెస్ట్ యాక్టింగ్...
ప్రశాంత్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ జీవించాడు. ఇన్నోసెన్స్, ప్రేమ కలగలసిన యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. హంసధ్వనిగా అంజనా జయప్రకాష్ పాత్ర రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నంగా ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. వినీత్, విజీ వెంకటేష్, ధ్వని రాజేష్‌తో పాటు మిగిలిన వారందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
Pachuvum Athbutha Vilakkum Review -సింపుల్ అండ్ బ్యూటీఫుల్
పచ్చువుమ్ అద్భుత విలక్కుమ్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ మూవీ. ఫహాద్ ఫాజిల్, అంజనా జయప్రకాష్ యాక్టింగ్‌తో మంచి కథ, కథనాలతో ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ ఈ సినిమా ఉంది.
రేటింగ్: 3/5