OTT Horror Thriller: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత తెలుగులో వస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ
11 December 2024, 7:25 IST
- OTT Horror Thriller: ఓటీటీలోకి ఇప్పుడో తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.
ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత తెలుగులో వస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ
OTT Horror Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో రాబోతోంది. ఎప్పుడో 20 ఏళ్ల కిందట వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమా గుర్తుందా? ఈ సినిమాతోనే అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సోనియా అగర్వాల్. ఇప్పుడు ఆమెనే నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 7/జీ ది డార్క్ స్టోరీ. ఆ 20 ఏళ్ల కిందటి సినిమాను గుర్తు చేసే టైటిల్ తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి తెలుగులోనూ అడుగుపెడుతోంది.
7/జీ ది డార్క్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్
7/జీ డార్క్ స్టోరీ ఓ తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ ఏడాది జులై 5న థియేటర్లలో రిలీజైంది. మొత్తానికి ఐదు నెలల తర్వాత గురువారం (డిసెంబర్ 12) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా మంగళవారం (డిసెంబర్ 10) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"7/జీ ది డార్క్ స్టోరీకి మారండి.. ఈ గురువారం మాతో కనెక్ట్ అవ్వండి" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.
7/జీ ది డార్క్ స్టోరీ మూవీ కథేంటంటే?
7/జీ ది డార్క్ స్టోరీ మూవీలో సోనియా అగర్వాల్ ఓ దెయ్యం పాత్ర పోషించింది. ఇందులో ఆమెది మంజుల అనే ఓ గృహిణి పాత్ర. తన కొడుకుతో కలిసి ఓ అపార్ట్‌మెంట్లో జీవిస్తూ తన సవతి సోదరుడి వేధింపులకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు.
ఆ తర్వాత అదే 7/జీ అపార్ట్‌మెంట్లోకి వర్ష (స్మృతి వెంకట్), తన భర్త రాజీవ్ తో కలిసి వస్తుంది. రాజీవ్ ను తిరిగి తన వశం చేసుకోవడానికి అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్.. వర్ష, ఆమె కుటుంబంపై చేతబడి చేస్తుంది. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని ఓ దెయ్యం వేధిస్తుంది. ఆ దెయ్యం ఎవరో కాదు అంతకుముందు అదే అపార్ట్‌మెంట్లో ఉన్న మంజుల అని వర్ష తెలుసుకుంటుంది.
ఆమె చావుకు కారణం తెలుసుకొని దానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మంజులకు వర్ష సాయం చేస్తుంది. హరూన్ డైరెక్ట్ చేసిన ఈ హారర్ మూవీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఐఎండీబీలోనూ 6.6 రేటింగ్ మాత్రమే ఉంది. అయితే హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఈ 7/జీ ది డార్క్ స్టోరీ మూవీకి ఆహా వీడియోలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.