Oscars 2025: 96ఏళ్లలో తొలిసారి ఆస్కార్ అవార్డుల వేడుక క్యాన్సల్ కానుందా? కారణం ఏంటంటే..
15 January 2025, 11:53 IST
- Oscars 2025: ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహణ సందేహాస్పదంగా మారింది. రద్దు కావొచ్చనే అంచనాలు బయటికి వస్తున్నాయి. ఇదే జరిగితే 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో రద్దవడం ఇదే తొలిసారి కానుంది. దీనికి కారణం ఏంటంటే..
Oscars 2025: 96ఏళ్ల తొలిసారి ఆస్కార్ అవార్డుల వేడుక క్యాన్సిల్ కానుందా? కారణం ఏంటంటే..
ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 ఆవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు విజృంభిస్తోంది. దావాలనం వేగంగా వ్యాప్తిస్తూ.. అడవిని, వందలాది ఇళ్లను దహించేస్తోంది. ఈ ఘోర విపత్తులో ఇప్పటికే 25 మందికి పైగా మృతి చెందారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆస్కార్ వేడుక జరగడం సందేహాస్పదంగా మారింది. ఆస్కార్ 2025 రద్దవుతుందని తాజాగా ఓ రిపోర్ట్ వెల్లడించింది. 96 ఏళ్లలో ఆస్కార్ ప్రదానోత్సవం తొలిసారి క్యాన్సల్ అవుతుందని పేర్కొంది.
సెలెబ్రేషన్స్ సరికాదనుకొని..
ఆస్కార్ అవార్డుల వేడుక ఈ ఏడాది రద్దు కావొచ్చని ది సన్ రిపోర్ట్ పేర్కొంది. కార్చిచ్చు వల్ల ప్రజలు తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలో ఆస్కార్ అవార్డులను సెలెబ్రేట్ చేసుకోవడం సరికాదని నిర్వాహకులు భావిస్తున్నట్టు వెల్లడించింది. “చాలా మంది లాస్ ఏంజిల్స్ వాసులు గుండె బద్దలయ్యే బాధతో, ఎంతో నష్టపోయిన తరుణంలో సెలెబ్రేట్ చేసుకోవడం సరికాదని అకాడమీ బోర్డ్ అనుకుంటోంది. మరో వారం రోజుల్లో కార్చిచ్చు తగ్గుముఖం పట్టినా.. ఆ బాధ ఇంకా కొన్ని నెలల సిటీలో బాధ కొనసాగుతూ ఉంటుంది. అందుకే దృష్టిని ప్రజలకు సాయం చేయడంపై పెట్టే అవకాశం ఉంది. దీని కోసం ఫండ్ రైజింగ్ సరైన అవకాశంగా ఉంటుంది” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
2021లో కరోనా విలయం సృష్టించిన సమయంలోనూ ఆస్కార్ అవార్డుల వేడుక రెండు నెలల ఆలస్యమైందే కానీ రద్దు కాలేదు. ప్రస్తుతం అకాడమీ అవార్డుల అధికారులుగా ఉన్న స్టార్స్ టామ్ హాంక్స్, ఎమ్మా స్టోన్, మెరిల్ స్ట్రీప్, స్టీవెన్ స్పిల్‍బర్గ్.. లాస్ఏంజిల్స్ కార్చిచ్చు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ భీకర విపత్తు వచ్చిన తరుణంలో ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించాలా వద్దా అనే విషయంపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నామినేషన్ల ప్రకటన వాయిదా
లాస్ ఏంజిల్స్ కార్చిచ్చు వల్ల ఆస్కార్ 2025 నామినేషన్ల ప్రకటన ఇప్పటికే వాయిదా పడింది. ఓటింగ్ పీరియడ్‍ను కూడా జనవరి 17వ తేదీ వరకు అకాడమీ పొడిగించింది. జనవరి 23వ తేదీన నామినేషన్లను ప్రకటించేందుకు కొత్త తేదీగా ప్రకటించింది. అయితే, అసలు ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుందా లేదా అనేదే ఇప్పుడు అనిశ్చితగా మారింది. మార్చి 3న ఆస్కార్ 2025 వేడుక షెడ్యూల్ ఉంది. మరి తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో భారీ సంఖ్యలో ఇళ్లు తగలబడ్డాయి. పూర్తిగా దగ్ధం అయిపోయాయి. కొందరు హాలీవుడ్ నటీనటుల ఇళ్లు కూడా ఈ కార్చిచ్చులో బూడిదయ్యాయి. మ్యాండీ మూర్, పారిస్ హిల్టన్ సహా మరికొందరు హాలీవుడ్ సెలెబ్రిటీలు ఇళ్లు కోల్పోయారు. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. తప్పిపోయిన కొందరి కోసం గాలింపు చర్యలు కూడా జోరుగా జరుగుతున్నాయి.