Mohan Babu: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.. రజనీకాంత్ 45 లక్షలు ఇచ్చాడు.. మంచు మోహన్ బాబు కామెంట్స్ వైరల్
12 December 2024, 11:20 IST
- Manchu Mohan Babu About Rajinikanth Over His Birthday: ప్రస్తుతం మంచు మోహన్ బాబు కుటుంబం వివాదస్పదం అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మోహన్ బాబు పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.. రజనీకాంత్ 45 లక్షలు ఇచ్చాడు.. మంచు మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Mohan Babu Comments On Rajinikanth: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ చాలా వివాదం అవుతోంది. మంచు విష్ణు, మంజు మనోజ్ అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు, ఈ నేపథ్యంలో మనోజ్‌పై మోహన్ బాబు దాడిగి దిగినట్లు అనేక రకాల వార్తలు ప్రచురితం అవుతున్నాయి.
హత్యాయత్నం కేసు
అలాగే, టీవీ9 రిపోర్టర్‌పై మైక్‌తో మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్ట్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇవాళ (డిసెంబర్ 12) సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా గతంలో ఆయన స్నేహం గురించి గొప్పగా చెప్పిన మోహన్ బాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
డైలీ కల్చర్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్ స్నేహం గురించి డైలాగ్ కింగ్ మోహన్ బాబు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. "1982లో మా అమ్మ పేరు మీద లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాను. మా సోదరుడు ఎన్టీఆర్ చెన్నై వచ్చి ప్రారంభించారు. అలా ప్రారంభించి నేను 1995 వరకు ఎన్నో సినిమాలు చేశాను? జయాపజయాలు మారుతూ వచ్చాయి" అని మోహన్ బాబు అన్నారు.
మరే సినిమాకు రాలేదు
"1995లో పెదరాయుడు అనే తెలుగు సినిమా తీశాను. అదే ఏడాది జూన్ 15న ఈ సినిమా విడుదలైంది. పెదరాయుడు మూవీకి వచ్చిన కలెక్షన్లు నా కెరీర్‌లో చేసిన మరే సినిమాకి రాలేదు. ఇది నిజం.. మొదటి ప్రివ్యూ షో కూడా మా సోదరుడు ఎన్టీఆర్‌కు చూపించాను. అది చూశాక ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆయన అన్నారు" అని మోహన్ బాబు తెలిపారు.
"పెద్దరాయుడు సినిమా ముందుగా తమిళంలో నట్టమై పేరుతో విడుదలైంది. తమిళంలో నట్టమై సినిమా చూశాక రజినీ నన్ను తన ఇంటికి పిలిచాడు. నట్టమై సినిమా ఇక్కడ హిట్ అయింది. ముందు చూడండి. మీకు నచ్చితే రైట్స్ కొనుక్కోండి అని చెప్పారు. నేను సినిమా చూసి చాలా బాగుందని చెప్పాను. ఆ తర్వాత నిర్మాత ఆర్బీ చౌదరితో మాట్లాడి రైట్స్ కొనుక్కోవాలని చెప్పాను. అప్పుడు నట్టమై సినిమా రైట్స్‌ని నేను మీకు తక్కువ రేటుకే ఇస్తున్నాను అని చెప్పారు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
తండ్రి పాత్రలో నటిస్తానని
"తర్వాత దర్శకుడు రవి రాజాను సినిమా చూడమని అడిగినప్పుడు ఆయన కొంత సమయం ఇవ్వమని చెప్పారు. మరుసటి రోజు రవిరాజా పెద్దరాయుడు చిత్రానికి దర్శకత్వం వహిస్తానని చెప్పాడు. ఆ తర్వాత తండ్రి పాత్రలో ఎవరు నటిస్తారో అని ఆలోచిస్తున్నాం. అప్పుడు రజినీ నాతో మాట్లాడి ఆ పాత్రలో నటిస్తానని చెప్పాడు. నేను ఆ పాత్రను పోషించాలని అనుకున్నాను కాబట్టే ఈ సినిమా చెప్పాను అన్నాడు" అని మోహన్ బాబు వెల్లడించారు.
"అతిథి పాత్రలో మీరు ఎలా నటిస్తారు. మీరు నాకు తండ్రి పాత్రలో నటించడం ఏంటీ అని అడిగాను. లేదు, నేను చేస్తాను అని నాకు చెప్పాడు. ఈ విషయాన్ని దర్శకుడు రవిరాజాకు ఆయన ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు రజినీకాంత్ తన సొంత ఖర్చులతో తండ్రి వేషంలో ఫోటో షూట్ చేసి ఫోటో పంపారు. ఇంత నిజాయితీ గల వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోయాను" అని మోహన్ బాబు తెలిపారు.
"ఆ తర్వాత పెదరాయుడు అనే టైటిల్ పెట్టమని రజినీ అడిగారు. వెంటనే అలాంటి టైటిల్‌తో సినిమా బాగా ఆడదని అన్నాను. లేదు అన్నాడు. దాంతో సరే అన్నాను. రాజమండ్రిలో సినిమా షూట్ చేశాం. ఆ గ్రామ ప్రజలు మా సినిమాకు చాలా సహకరించారు" అని మోహన్ బాబు అన్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను
"అంతకు ముందు నా రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అప్పుడు నేను కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. రజినీ చెన్నై నుంచి రాజమండ్రికి రైళ్లో వచ్చాడు. అప్పుడే ఒక బ్యాగులో నుంచి రూ. 45 లక్షలు తీసి రజనీ నాకు ఇచ్చాడు. మీరు కష్టాల్లో ఉన్నారని నాకు తెలుసు. ఈ సినిమా విజయం తర్వాత తిరిగి ఇవ్వండి అని ఇచ్చాడు" అని మోహన్ బాబు వెల్లడించారు.
"రజనీ వాట్ ఏ మ్యాన్. వాట్ ఏ ఫ్రెండ్. ఈ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఒక తమ్ముడు ఎలా ఉండాలో చెప్పే చిత్రమిది. ఇకపై అలాంటి సినిమా చేయలేనేమో" అని రజనీకాంత్ స్నేహం గురించి మోహన్ బాబు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.