Manchu Manoj: మోహన్ బాబుని ఇరుకున పెట్టేస్తున్న మంచు మనోజ్.. వాళ్లది తప్పులేదు నేనే ఇంట్లోకి తీసుకెళ్లానన్న చిన్నకొడుకు
14 December 2024, 14:46 IST
Manchu Manoj: జల్‌పల్లిలోని తన ఇంట్లోకి మీడియా ప్రతినిధులు అక్రమంగా ప్రవేశించారని మోహన్ బాబు మండిపడ్డారు. కానీ.. మంచు మనోజ్ మాత్రం తానే మీడియాని లోపలికి తీసుకెళ్లినట్లు అంగీకరించారు. దాంతో..?
మోహన్ బాబు
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. గత ఆదివారం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. సోమవారం ఇద్దరూ పోలీసులకి ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంట్లోకి గేటు తోసుకుంటూ ప్రవేశించిన మంచు మనోజ్.. ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాడు. మనోజ్ వెంట వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడిచేయడం.. ఆపై కేసు నమోదుతో ఇప్పుడు అరెస్ట్ కత్తి మోహన్ బాబుపై వేలాడుతోంది.
అజ్ఞాతం అబద్ధం.. ఇంట్లోనే ఉన్నా
మీడియా ప్రతినిధిపై దాడి విషయంలో ఇప్పటికే మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా క్షమాపణలు చెప్పారు. కానీ.. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు ప్రయత్నించాడని.. ఆ పిటీషన్‌ను కోర్టు కొట్టివేయడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. అదంతా అబద్ధమని మోహన్ బాబు శనివారం క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. అస్వస్థత కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు.
నేనే మీడియాను తీసుకెళ్లా
మీడియాపై మోహన్ బాబు దాడి విషయంలో మంచు మనోజ్ మరోసారి స్పందించారు. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి లోపలకి తానే మీడియాను తీసుకెళ్లినట్లు అంగీకరించాడు. ఇంట్లోకి తనను అనుమతించకపోవడంతో.. నిస్సహాయ స్థితిలో తాను మీడియాను వెంట బెట్టుకుని వెళ్లినట్లు మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అయితే.. లోపలికి వెళ్లిన అనంతరం తొలుత తనపై.. ఆ తర్వాత మీడియాపై దాడి జరిగిందని.. ఇందులో మీడియా తప్పు లేదని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. దాంతో మంచు మోహన్ బాబుదే తప్పు అన్నట్లు తేలిపోయింది.
విచక్షణ కోల్పోయిన మోహన్ బాబు
మంచు మనోజ్ వెంట ఇంటి లోపలికి వెళ్లిన మీడియా ప్రతినిధి.. ఈ ఇష్యూపై మీరు ఏం చెప్తారు? అని మోహన్ బాబుని ప్రశ్నించగా.. క్షణికావేశంలో మైక్ తీసుకుని అతనిపై దాడికి తెగబడ్డాడు. దాంతో మీడియా ప్రతినిధికి గాయమవగా.. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.