Manchu Manoj: కూర్చొని చర్చించుకోవడానికి నేను రెడీ.. మా అమ్మ ఆసుపత్రిలో లేదు.. అతని వల్లే ఈ గొడవలన్న మంచు మనోజ్
11 December 2024, 15:28 IST
Manchu Manoj vs Mohan Babu: మంచు ఫ్యామిలీ వరుసగా నాలుగు రోజుల నుంచి గొడవలతో వార్తల్లో నిలుస్తోంది. దాంతో సమస్యల పరిష్కారానికి తాను సిద్ధమని మంచు మనోజ్ ప్రకటించారు. మరోవైపు నుంచి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు మాత్రం ఎలా స్పందిస్తారో చూడాలి.
మంచు మనోజ్
మంచు ఫ్యామిలీలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న గొడవలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ జల్‌పల్లిలో మంచు మోహన్ బాబు ఇంట్లోకి తన మనుషులతో మంచు మనోజ్ చొచ్చుకెళ్లగా.. అక్కడే ఉన్న బౌన్సర్లతో అతనికి ఘర్షణ జరిగింది. దాంతో మంచు మనోజ్ చిరిగిన చొక్కాతో బయటికిరాగా.. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడి చేశారు. ఈ నేపథ్యంలో.. ఈ వివాదం ఇప్పుడు రాచకొండ కమిషనరేట్‌కి చేరింది.
తుపాకీలు సరెండర్
జల్‌పల్లిలో గొడవ తర్వాత మోహన్ బాబు, మంచు మనోజ్‌తో పాటు మంచు విష్ణుకి కూడా రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఈ వివాదంపై .. బుధవారం కమిషనరేట్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో ఆదేశించారు. అంతేకాదు.. గొడవల నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణు వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీలను కూడా వెంటనే పోలీసులకి సరెండర్ చేయాలని ఆదేశించారు. కానీ.. మంచు మనోజ్‌తో గొడవ తర్వాత అస్వస్థతకి గురైన మంచు మోహన్ బాబు ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విచారణకి మోహన్ బాబు, విష్ణు డుమ్మా
రాచకొండ సీపీ ముందు ఈరోజు మంచు మనోజ్ మాత్రమే హాజరవగా.. మంచు విష్ణు, మోహన్ బాబు హాజరుకాలేదు. దాంతో.. కమిషనరేట్ వద్ద మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. ఫ్యామిలీలో సమస్యల పరిష్కారానికి కూర్చొని చర్చించుకోవడానికి తాను సిద్ధమని ప్రకటించాడు. తాను ఇప్పటి వరకు ఆస్తిపాస్తులను అడగలేదని.. అలాంటి మనస్తత్వం తనది కాదని చెప్పుకొచ్చిన మంచు మనోజ్.. తన తల్లి ఆసుపత్రిలో ఉందనే మాట కూడా అవాస్తవమని చెప్పుకొచ్చారు.
వినయ్ వల్లే ఇదంతా
మంగళవారం ఒక ఆడియో బైట్ విడుదల చేసిన మంచు మోహన్ బాబు.. అందులో మంచు మనోజ్‌ను ఉద్దేశిస్తూ మీ అమ్మ ఆసుపత్రిలో ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. మా అమ్మ ఆసుపత్రిలో లేదని.. ఆమె ఇంట్లోనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వివాదానికి కారణం మా నాన్న కాదని.. వినయ్ వల్లే ఇదంతా జరుగుతోందని మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతికి సమీపంలోని విద్యానికేతన్ విద్యా సంస్థలను ఈ వినయ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.