Kanguva OTT release: కంగువా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?
06 December 2024, 19:56 IST
Kanguva OTT release: సూర్య నటించిన కంగువా సినిమా రూ.2 వేల కోట్లు వసూలు చేస్తుందని ప్రొడ్యూసర్ గర్వంగా చెప్పాడు. కానీ.. అతను అంచనా వేసిన వసూళ్లలో కనీసం 10 శాతం కూడా ఈ మూవీ రాబట్టలేకపోయింది .
ఓటీటీలోకి కంగువా
తమిళ్ హీరో సూర్య, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కాంబినేషన్‌లో వచ్చిన ఫాంటసీ పీరియాడిక్ డ్రామా ‘కంగువా’ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకి అధికారిక ప్రకటన శుక్రవారం వచ్చింది. భారీ అంచనాల మధ్య నవంబరులో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో.. నెలరోజుల్లోపే ఓటీటీలో విడుదలకు కంగువా సిద్ధమైంది.
సూర్యా నటనకి ప్రశంసలు.. కానీ?
నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చిన కంగువాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఫాంటసీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటనను ఎక్కువ మంది అభినందించగా, సినిమా మరీ సాగదీతగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. రిలీజ్ రోజే నెగటివ్ టాక్ రావడంతో.. ఆ ప్రభావం వసూళ్లపై పడింది.
రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఒకానొక దశలో కంగువా కనీసం రూ.100 కోట్ల మార్కును దాటగలదా ? అనిపించింది.
కంగువా వసూళ్లపై జోక్‌లు
వాస్తవానికి ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాను మూవీ రిలీజ్‌కి రూ.1000 కోట్ల మార్క్‌ని కంగువా టచ్ చేస్తుందా? అని ప్రశ్నించగా.. "నేను రూ.2000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను ఆశిస్తున్నాను. మీరు రూ.1000 కోట్ల మార్కుతో పోలుస్తూ ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు" అంటూ మండిపడ్డాడు. తమిళ్ మీడియా కోలీవుడ్ బాహుబలి అంటూ కంగువాపై అంచనాల్ని పెంచేసింది. కానీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలమైంది. దాంతో ప్రొడ్యూసర్ మాటలపై సోషల్ మీడియాలో జోక్‌లు పేలాయి.
శివ దర్శకత్వం వహించిన కంగువాలో సూర్య ఫ్రాన్సిస్, కంగువాగా ద్విపాత్రాభినయం చేయగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణ్యం, కె.ఎస్.రవికుమార్, యోగిబాబు, రెడిన్ కింగ్ స్లే, కోవై సరళ, రవి రాఘవేంద్ర, కరుణాస్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలోకి కంగువా ఎప్పుడంటే?
ఇప్పటివరకు తీసిన అత్యంత ఖరీదైన తమిళ చిత్రాల్లో కంగువా ఒకటికాగా.. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 35 భాషల్లో విడుదలైంది. కానీ.. చెప్పుకోదగ్గ వసూళ్లని కూడా తమిళనాడులో రాబట్టుకోలేకపోయింది.
కంగువా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు అధికారికంగా ఈరోజు ప్రకటించింది.