Kanguva OTT Release Date: సూర్య భారీ బడ్జెట్ సినిమా కంగువా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎక్కడ చూడొచ్చంటే?
01 December 2024, 16:40 IST
Kanguva OTT Date: సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన కంగువా మూవీ.. ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత వసూళ్లు రాబట్టింది? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?
కంగువాలో సూర్య
Kanguva OTT: తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. శివ దర్శకత్వంలో తెరెక్కిన ఈ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ నవంబరు 11న థియేటర్లలోకి వచ్చింది. తమిళ్ బాహుబలి అంటూ కోలీవుడ్ ప్రచారం చేయడంతో.. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన కంగువా తొలిరోజే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుని.. బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయింది.
రెండో రోజుకే కలెక్షన్లు ఢమాల్
కంగువా సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని నటించగా.. విలన్‌గా బాబీ డియోల్ నటించారు. అలానే యోగి బాబు, నటరాజన్, రెడిన్ కింగ్‌స్లే తదితరులు కీలక పాత్రలు పోషించారు. కానీ.. మూవీ తెలుగు వారికే కాదు.. తమిళులకి కూడా సరిగా కనెక్ట్ కాలేదు. దాంతో పెద్ద ఎత్తున నెగటివ్ రివ్యూస్ రావడంతో రెండో రోజుకే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
కంగువా మూవీలో ఏం నచ్చలేదంటే?
వెయ్యేళ్ల కిందటి కథని వర్తమానానికి ముడిపెట్టేందుకు దర్శకుడు శివ ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రాధాన్యత లేని పాత్రల పరిచయం, కథలో సాగదీత మూవీలోని తొలి 20 నిమిషాలు ప్రేక్షకులకి బోర్ కొట్టించాయి. అలానే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై కూడా దారుణంగా ట్రోల్స్ నడిచాయి. కథకి అవసరం లేకపోయినా.. ఐదు వంశాల గురించి దర్శకుడు చెప్పే ప్రయత్నం చేయడం.. ప్రేక్షకుల్ని తికమక పెట్టించింది. దాంతో ప్రేక్షకులు పూర్తిగా కథలో లీనం అవ్వలేకపోయారు.
బడ్జెట్‌లో సగం కూడా...
కంగువా సినిమా రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లని కంగువా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే.. బడ్జెట్‌లో సగం కూడా వసూళ్లని సూర్య సినిమా రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ ఎంతలా కోలీవుడ్‌పై పడిందంటే..? ఇకపై సినిమా థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పకుండా నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు నిషేధం విధించాయి.
కంగువా ఓటీటీలోకి ఎప్పుడంటే?
కంగువా సినిమా రిలీజ్‌కి ముందు ఏర్పడిన క్రేజ్ కారణంగా.. మంచి ఫ్యాన్సీ రేటుకి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. దాంతో.. ఈ మూవీని నెల రోజుల్లోనే స్ట్రీమింగ్‌కి ఉంచబోతోంది. డిసెంబరు 13 నుంచి కంగువా ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌కి ఉంచనుంది.
టాపిక్