Amaran Movie: అమరన్ మూవీకి హిట్ టాక్ రావడంతో కమల్ హాసన్ ఎమోషనల్ ట్వీట్.. రజినీకాంత్ సపోర్ట్
02 November 2024, 15:25 IST
Kamal Haasan: అమరన్ మూవీ తాను ఊహించినట్లే సక్సెస్ అవ్వడంతో కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని గర్వపడేలా చేస్తాయంటూ ప్రొడ్యూసర్ కమల్ హాసన్ ఎమోషనల్ అయిపోయారు.
అమరన్ మూవీలో శివ కార్తికేయన్, సాయి పల్లవి
దీపావళి కానుకగా తెలుగులో విడుదలైన మూడు సినిమాలు పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తున్నాయి. లక్కీ భాస్కర్ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అవ్వగా.. కా సినిమా థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టపడే వారిని ఆకట్టుకుంటోంది. ఇక అమరన్ మూవీ అటు యూత్.. ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా నచ్చడంతో సౌత్‌లో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తోంది.
లవ్‌కి ఎమోషన్
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ అమరన్ మూవీకి రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వం వహించారు. కార్గిల్ వార్‌లో అసువులుబాసిన మేజర్ ముకుంద్ జీవిత కథ ఆధారంగా.. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీకి లవ్, ఎమోషన్ కూడా జోడించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
అమరన్ సినిమాని సోనీ పిక్చర్స్‌తో కలిసి సీనియర్ నటుడు కమల్ హాసన్ నిర్మించారు. మూవీకి హిట్ టాక్ రావడంతో ప్రొడ్యూసన్ కమల్ హాసన్ ఎక్స్ (ట్విట్టర్)లో ఎమోషనల్ అవుతూ ఒక నోట్‌ని కూడా రిలీజ్ చేశారు.
గర్వపడేలా చేసిన సినిమా
‘‘కొన్ని సినిమాలు మనకి ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని గౌరవాన్ని పెంచుతాయి. కానీ అతి కొద్ది సినిమాలు మాత్రమే మనం గర్వపడేలా చేస్తాయి. ఇలా గర్వపడేలా చేసిన సినిమానే అమరన్.
ఈ మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడే గొప్ప సినిమా అవుతుందని యూనిట్‌కి చెప్పాను. నా అంచనా నిజమైంది. దాదాపు మూడేళ్ల పాటు చిత్ర యూనిట్ చాలా శ్రమించింది. సినిమాని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అంటూ కమల హాసన్ ఆ నోట్‌లో రాసుకొచ్చారు.
కలెక్షన్లలో అమరన్ హవా
అమరన్ మూవీ విడుదలైన తొలిరోజే 21.80 కోట్లు వసూళ్లు రాబట్టగా.. రెండో రోజు కూడా రూ.19.30 కోట్లు వరకూ కలెక్షన్లు వచ్చాయి. ఇందులో మరీ ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ నుంచి అత్యధిక వసూళ్లు వస్తుండటం గమనార్హం.
ఇప్పటికే తెలుగులో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉండగా..తమిళ్‌లో శివ కార్తీకేయన్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతలా అంటే.. అమరన్ మూవీ తొలి రోజే తమిళనాడులో ఏకంగా 77.94 % థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు అమరన్‌కి హవా కొనసాగే అవకాశం ఉంది. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కనీసం రూ.150 కోట్ల వరకు ఈ సినిమా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా.
రజినీకాంత్ సపోర్ట్
అమరన్ సినిమాకి రజినీకాంత్ కూడా సపోర్ట్‌గా నిలిచాడు. సినిమా రిలీజైన రోజే ప్రొడ్యూసర్ కమల్ హాసన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలిపిన రజినీకాంత్.. శనివారం చిత్ర యూనిట్‌ని ఇంటికి పిలిచి మరీ అభినందనలు తెలిపారు.