Devara Closing Collections: ఎన్టీఆర్ దేవర ఫైనల్ కలెక్షన్స్ ఇవే - మొత్తం లాభాలు ఎంతంటే? - ఏదో అనుకుంటే...
29 November 2024, 13:52 IST
Devara Closing Collections: ఎన్టీఆర్ దేవర 2024లో టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా నిర్మాతలకు 74 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్, హిందీలో అదరగొట్టిన ఈ మూవీ కేరళలో డిసపాయింట్ చేసింది.
దేవర ఫైనల్ కలెక్షన్స్
Devara Closing Collections: ఎన్టీఆర్ దేవర మూవీ 2024 ఏడాదిలో టాలీవుడ్‌లో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 450 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 260 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. దాదాపు 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. నిర్మాతలకు 74 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 240 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్...162 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది.
కేరళలో అతి తక్కువ...
తెలుగు రాష్ట్రాల తర్వాత ఓవర్‌సీస్‌లో 36 కోట్లు...హిందీలో 34 కోట్ల వరకు దేవర మూవీ కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నది. తమిళనాడు, కేరళలో మాత్రం నిరాశపరిచింది. కేరళలో దేవర మూవీ కోటిలోపే వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా దేవర వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటుతుందని, నిర్మాతలకు వంద కోట్లకుపైనే లాభాలను తెచ్చిపెడుతుందని అనుకున్నారు. మిక్స్‌డ్ టాక్ కారణంగా అంచనాల్ని అందుకోలేకపోయింది.
జాన్వీ కపూర్...
దేవర మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎన్టీఆర్ సోదరుడు, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
ఎర్రసముద్రం దేవర కథ...
ఎర్ర సముద్రంలోని నాలుగు ఊళ్లకు దేవర నాయకుడిగా ఉంటాడు. తన స్నేహితుడు రాయప్ప(శ్రీకాంత్), మరో ఊరి పెద్ద భైరతో (సైఫ్ అలీఖాన్) కలిసి మురుగ (మురళీ శర్మ) కోసం పనిచేస్తుంటాడు దేవర. నౌకల్లో మురుగ దిగుమతి చేసుకుంటున్న అక్రమ ఆయుధాల్ని నావీ అధికారుల కంటపడకుండా ఒడ్డుకు చేరుస్తుంటాడు దేవర.
మురుగ అక్రమ ఆయుధాల కారణంగా తమ ప్రాంతానికే చెందిన ఓ వ్యక్తి చనిపోతాడు. అప్పటి నుంచి మురుగ కోసం పనిచేయకూడదని దేవర నిర్ణయించుకుంటాడు.తన మాటను కాదని మురుగ కోసం ఎవరూ పనిచేయద్దని దేవర చెబుతాడు. దాంతో దేవరకు భయపడి ఎర్రసముద్రం ప్రాంత ప్రజలు సముద్రంలోకి అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అక్రమ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగాలంటే దేవర అడ్డు తొలగించుకోవాలని భైరా ప్లాన్ చేస్తాడు.
మరోవైపు దేవర ధైర్యానికి చిరునామా అయితే అతడి కొడుకు వర (ఎన్టీఆర్) భయానికి కేరాఫ్ అడ్రస్‌గా పెరుగుతాడు. వర పిరికివాడుగా పెరగడానికి కారణం ఏమిటి? స్నేహితుడైన భైర తనను చంపాలనుకున్న విషయం తెలిసి దేవర ఏం చేశాడు?
భైర కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? వర పిరికివాడిగా ఎందుకు పెరిగాడు? తండ్రి లక్ష్యాన్ని వర ఎలా పూర్తిచేశాడు? వరను ప్రేమించిన తంగం (జాన్వీ కపూర్) ఎవరు అన్నదే దేవర మూవీ కథ.
డ్రాగన్…
దేవర తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.