Nandamuri Taraka Rama Rao: జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు ‘నందమూరి తారక రామారావు’ హీరోగా సినిమా.. అనౌన్స్‌మెంట్ టైమ్ ఇదే
09 June 2024, 21:38 IST
- Nandamuri Taraka Rama Rao: జూనియర్ ఎన్టీఆర్ సోదరుడి కుమారుడు నందమూరి తారక రామారావు తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‍కు టైమ్ కూడా ఖరారైంది.
నందమూరి తారక రామారావు చిన్నప్పటి ఫొటో - డైరెక్టర్ వైవీఎస్ చౌదరి
Nandamuri Taraka Rama Rao: విశ్వ విఖ్యాత సీనియర్ నందమూరి తారక రామారావు ముని మనవడు, హరికృష్ణ మనవడు తెరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. అతడి పేరు కూడా ‘నందమూరి తారక రామారావు’. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు దివంగత జానకిరామ్ కుమారుడే ఇతడు. సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడిగా ఆయన పేరుతోనే అతడు వచ్చేస్తున్నారు. ఈ తరం నందమూరి తారక రామారావు నటించనున్న తొలి చిత్రానికి వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్‍కు డేట్, టైమ్ కూడా ఖరారయ్యాయి.
సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ అంటూ..
సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ వస్తోందంటూ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు (జూన్ 10) ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఈ ప్రకటన వస్తుందని వెల్లడించారు. మరో అద్భుతమైన జర్నీ ప్రారంభం కానుందంటూ నేడు (జూన్ 9) ట్వీట్ చేశారు.
“డైనమిక్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి నుంచి సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్‍కు రెడీగా ఉండండి. రేపు జూన్ 10 ఉదయం 8:45 గంటలకు ప్రకటన వస్తుంది” అని వైవీఎస్ చౌదరి పోస్ట్ చేశారు. హీరో ఎవరు అనేది ఈ ట్వీట్‍లో వైవీఎస్ వెల్లడించలేదు. అయితే, నందమూరి జానకి రామ్ కుమారుడు తారక రామారావును హీరోగా పరిచయం చేసే మూవీ గురించే అని సమాచారం బయటికి వచ్చేసింది.
తారక రామారావు ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనిపించలేదు. దీంతో ప్రస్తుతం అతడు ఎలా ఉన్నాడో కూడా చాలా మందికి తెలియదు. చిన్నప్పటి ఫొటోలే ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తారక రామారావు ఇప్పుడు ఎలా ఉన్నారో అనే ఆసక్తి అందరిలో ఉంది.
సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, ఒక్క మగాడు సహా మరికొన్ని సినిమాలకు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. చివరగా సాయిధరమ్ తేజ్‍తో 2015లో రేయ్ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడు, మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టనున్నారు. హరికృష్ణ మనవడు తారక రామారావును వెండి తెరకు పరిచయం చేయనున్నారు.
రేపే బాలకృష్ణ పుట్టిన రోజు.. అప్‍డేట్లు ఇవే
నట సింహం నందమూరి బాలకృష్ణ రేపు (జూన్ 10) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ఎన్‍బీకే 109 మూవీ నుంచి గ్లింప్స్ రానుంది. రేపు ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుంది. బాబీ కొల్లి ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సూపర్ హిట్ ద్వయం బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్‍లో మరో మూవీ రూపొందనుంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం గురించి అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ సినిమాపై రేపు ఉదయం 8 గంటల 28 నిమిషాలకు ప్రకటన వస్తుంది. బాలయ్య - బోయపాటి కాంబోలో ఇది నాలుగో చిత్రంగా ఉండనుంది.