Jayam Ravi Divorce: జయం రవి విడాకుల్లో ట్విస్ట్.. తనను అడగకుండా ఎలా ఇస్తారంటూ భార్య సీరియస్
11 September 2024, 11:34 IST
- Jayam Ravi Divorce: జయం రవి విడాకుల్లో ఓ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తన అనుమతి లేకుండానే తన భర్త పూర్తి ఏకపక్షంగా ఈ విడాకుల ప్రకటనను పబ్లిగ్గా చెప్పాడని అతని భార్య ఆర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం (సెప్టెంబర్ 11) ఆమె రిలీజ్ చేసిన ప్రకటన వైరల్ అవుతోంది.
జయం రవి విడాకుల్లో ట్విస్ట్.. తనను అడగకుండా ఎలా ఇస్తారంటూ భార్య సీరియస్
Jayam Ravi Divorce: తమిళ నటుడు జయం రవి విడాకుల విషయంలో పెద్ద ట్విస్టే ఇచ్చింది అతని భార్య ఆర్తి. రెండు రోజుల కిందట అతడు తన భార్యతో విడిపోతున్నానని చెప్పడమే కాకుండా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ ఫైల్ చేశాడన్న వార్తల నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 11) ఆర్తి ఓ ప్రకటన విడుదల చేసింది. తన అనుమతి లేకుండానే రవి ఇలా చేయడం సరి కాదని ఆమె అనడం గమనార్హం.
చాలా షాకింగా ఉంది: ఆర్తి
జయం రవి భార్య ఆర్తి బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తన ప్రకటన పోస్ట్ చేసిన కామెంట్స్ సెక్షన్ పని చేయకుండా చేసింది. తనకు తెలియకుండానే తాము విడాకులు తీసుకుంటున్నామని రవి అందరికీ చెప్పడం తనను షాక్‌కు గురి చేసిందని ఆర్తి చెప్పడం విశేషం.
"మా పెళ్లి గురించి ఈ మధ్యే నా అనుమతి లేకుండా చేసిన ప్రకటనతో నేను చాలా షాక్ కు గురవడమే కాదు బాధ కూడా కలిగింది. 18 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని పంచుకునే సమయంలో పరస్పర గౌరవం, ప్రైవసీలాంటివి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆర్తి అందులో స్పష్టం చేసింది.
ఇది పూర్తిగా రవి ఏకపక్ష నిర్ణయమే..
"నా భర్తతో నేరుగా మాట్లాడదామని కొన్నాళ్లుగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. మేము, మా కుటుంబాలతో ముడిపడి ఉన్న ఈ విషయాన్ని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలని భావించాను. కానీ ఆ అవకాశం నాకు దక్కకపోవడం విచారకరం. ఈ ప్రకటన నన్ను, నా ఇద్దరు పిల్లలను పూర్తిగా విస్మయానికి గురి చేసింది" అని ఆర్తి చెప్పింది.
ఈ నిర్ణయం పూర్తిగా అతనిదే అని ఆర్తి వెల్లడించింది. "పెళ్లి బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షం. ఇది మా కుటుంబానికి ఏమాత్రం మేలు చేయదు. ఇంత జరిగినా నేను ఎంతో హుందాగానే ఇప్పటి వరకూ పబ్లిగ్గా ఎలాంటి కామెంట్ చేయలేదు" అని ఆర్తి తెలిపింది.
ట్రోల్స్ తట్టుకోలేకే..
ఇప్పటికైనా తాను నోరు విప్పింది ట్రోల్స్ తట్టుకోలేకే అని ఆర్తి చెప్పింది. "ఈ విషయంలో నన్ను నిందిస్తూ చేస్తున్న కామెంట్స్ వేదన కలిగిస్తున్నాయి. నా వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారు. ఓ తల్లిగా నా పిల్లల సంరక్షణకే నా తొలి ప్రాధాన్యత. అందుకే నా పిల్లలపై ప్రభావం చూపే ఇలాంటి కామెంట్స్ ను నేను ఉపేక్షించను" అని ఆర్తి స్పష్టం చేసింది.
మరోవైపు జయం రవి ఇప్పటికే చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఏషియానెట్ న్యూస్ వెల్లడించింది. దీనిపై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. అంతకుముందు రోజే తాను ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపాడు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.