Google Most Searched Movies 2024: గూగుల్ సెర్చ్‌లో తెలుగు సినిమాల హవా.. టాప్ 10లో మూడు మనవే..
11 December 2024, 10:08 IST
- Google Most Searched Movies 2024: ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో మూడు తెలుగువే కావడం విశేషం. అవన్నీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమాలే.
గూగుల్ సెర్చ్‌లో తెలుగు సినిమాల హవా.. టాప్ 10లో మూడు మనవే..
Google Most Searched Movies 2024: ప్రతి ఏడాది డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు గూగుల్ ట్రెండ్స్ జాబితా వచ్చేస్తుంది. ఆ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు, వ్యక్తులు, ఇతర కేటగిరీలకు సంబంధించిన లిస్టును చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. 2024 ఏడాదికి కూడా ఈ జాబితాలు ఒక్కొక్కటిగా వస్తుండగా.. తాజాగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ వచ్చేసింది.
ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీస్ ఇవే
గూగుల్ ఇండియన్ ట్రెండ్స్ 2024లో ఎక్కువ మంది ఏ సినిమాల కోసం సెర్చ్ చేశారన్నది తాజా లిస్టు ద్వారా తెలుస్తుంది. టాప్ 10లో మూడు తెలుగు సినిమాలే ఉండటం విశేషం. అందులోనూ రెండు ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. కల్కి 2898 ఏడీతోపాటు హనుమాన్, సలార్ సినిమాలు ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
టాప్ 10లో రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ నిలిచింది. ఐదో స్థానంలో హనుమాన్ ఉండగా.. 9వ స్థానంలో సలార్ మూవీ ఉంది. నిజానికి సలార్ మూవీ గతేడాది డిసెంబర్ లో రిలీజైనా.. ఈ ఏడాది కూడా సెర్చ్ లో టాప్ 10లో నిలవడం గమనార్హం. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ కు మంచి హిట్ అందించిన సినిమా ఇది.
ఆ రెండూ ఎప్పుడూ వార్తల్లోనే..
గూగుల్ సెర్చ్ లో కల్కి 2898 ఏడీ, హనుమాన్ టాప్ 10లో ఉండటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ ఏడాది ఈ రెండు తెలుగు సినిమాల పాన్ ఇండియా స్థాయిలో క్రియేట్ చేసిన బజ్ అలాంటిది. సంక్రాంతి సమయంలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగలాంటి సినిమాలతో పోటీ పడి రిలీజైన హనుమాన్ అంతకుముందు 90 ఏళ్ల సంక్రాంతి సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసింది. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగులోనే కాదు హిందీలోనూ ఈ సూపర్ హీరో మూవీని ఎగబడి చూశారు. తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులను తిరగరాసింది.
ఇక 2024లో మోస్ట్ అవేటెట్ సినిమాల్లో ఒకటిగా కల్కి 2898 ఏడీ నిలిచింది. ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ల అంచనాలను అందుకుంటూ ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లకుపైనే వసూలు చేసింది. ఇక ఓవరాల్ గా టాప్ 10 సినిమాల్లో మూడు తెలుగు సినిమాలు ఉండగా.. మూడు హిందీ మూవీస్, రెండు తమిళం, రెండు మలయాళం సినిమాలు నిలిచాయి.
టాప్ 10 గూగుల్ సెర్చెస్ ఇవే
1. స్త్రీ2
2. కల్కి 2898 ఏడీ
3. 12th ఫెయిల్
4. లాపతా లేడీస్
5. హనుమాన్
6. మహారాజా
7. మంజుమ్మెల్ బాయ్స్
8. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
9. సలార్
10. ఆవేశం
టాపిక్