The Kashmir Files Controversy: కశ్మీర్ ఫైల్స్ చెత్త సినిమా.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
08 January 2024, 21:52 IST
- The Kashmir Files Controversy: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ దర్శకులు, స్క్రీన్ రైటర్ సయీద్ అఖ్తర్ మీర్జా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చెత్త సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై బాలీవుడ్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
The Kashmir Files Controversy: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పటి నుంచి ఏదోక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంది. ఇటీవలే ఇజ్రాయిల్ ఫిల్మ్ మేకర్ నదాల్ లాపిడ్ కూడా సదరు సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సయిద్ అఖ్తర్ మీర్జా సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రం చెత్త అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాకుండా పాయింట్ ఎప్పుడూ ఓ పక్క పక్షపాతంగా ఉండకూడదని స్పష్టం చేశారు.
"నా వరకైతే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చెత్తతో సమానం. కశ్మీరీ పండిట్ల అంశం చెత్తా అంటే కాదనే చెబుతాను. నిజంగా ఆ ఉదంతం జరిగింది కాదను. కానీ కేవలం కశ్మీరీ హిందువులకే జరిగిందా? కాదు.. ముస్లీంలు కూడా అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూఢాచార సంస్థల కుతంత్రాలు, జాతీయ ప్రయోజనాలు అని చెప్పే సరిహద్దు అవతల డబ్బున్న అబ్బాయిల కుట్రల్లో నమ్మశక్యం కానీ రీతిలో ఉచ్చులో చిక్కుకున్నారు. వారు విధ్వంసం సృష్టించడం కొనసాగిస్తున్నారు. ఇలా ఇరు పక్షాలు ఇబ్బంది పడినప్పుడు ఓ పక్షమే వహించడం సరికాదు. ఇది అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి." అని సయిద్ అఖ్తర్ సంచలన ఆరోపణలు చేశారు.
సయీద్ అఖ్తర్ బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న దర్శకులు. ఆయన జోషి హజీర్ హో(1984), ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతా హై(1980), సలీమ్ లంగడే పే మత్ రో(1989), నసీమ్(1995) లాంటి చిత్రాలతో పాపురయ్యారు.
వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ చిత్రం 80వ దశకం చివర్లో 90వ దశకం ప్రారంభంలో కశ్మీరీ హిందువులపై జరిగిన హింసాకాండ గురించి తెరెకెక్కించారు. కశ్మీరి పండిట్ల ఊచకోతను ఇందులో చూపించారు. ఈ ఏడాది మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా.. విపరీతంగా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సంవత్సరం విజయవంతమైన హిందీ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ఇందులో నటించారు.
ఇటీవలే ఈ సినిమాపై ఇజ్రాయిల్ ఫిల్మ్ మేకర్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ అసభ్యకరమైన ప్రచారంగా అభివర్ణించారు. దీంతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. అనుపమ్, వివేక్ అగ్నిహోత్రి వారు నదావ్‌ను బహిరంగంగా విమర్శించారు.
టాపిక్