Black Review: బ్లాక్ రివ్యూ - టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన బ్లాక్‌బస్టర్ తమిళ్ మూవీ ఎలా ఉందంటే?
02 November 2024, 9:38 IST
Black Review: థియేటర్లలో హిట్టు టాక్ తెచ్చుకున్న తమిళ మూవీ బ్లాక్ ఇటీవల ఆమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీలో జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
బ్లాక్ రివ్యూ
Black Review: జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళయా మూవీ బ్లాక్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీకి కేజీ సుబ్రమణి దర్శకత్వం వహించాడు. కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ ప్రయోగాత్మక మూవీ ఎలా ఉందంటే?
టైమ్ ట్రావెల్...
వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యాభర్తలు. వసంత్‌కు కోపం ఎక్కువ. తాగిన మత్తులో పబ్‌లో కొందరితో గొడపపడతాడు. ఆ గొడవ మూలంగా వసంత్‌తో పార్టీ అంటేనే అరణ్య భయపడిపోతుంది.
ఆఫీస్‌కు వన్ వీక్ హాలీడేస్ రావడంతో బీచ్ దగ్గరలో తాము కొత్తగా కొన్న కొత్త విల్లాలో సరదాగా గడపాలని ప్లాన్ చేస్తారు. ఈ గేటేడ్ కమ్యూనిటీ విల్లా వర్క్ మొత్తం కంప్లీట్ కాకపోవడంతో వసంత్, అరణ్య తప్ప అందులోకి ఎవరూ షిఫ్ట్ కారు.
అదే రోజు రాత్రి తమ ఎదురుగా ఉన్న విల్లాలో లైట్స్ వేసి ఉండటం అరణ్య, వసంత్ చూస్తారు. ఆ విల్లాలోకి వెళ్లి చూడగా అచ్చుగుద్దినట్లు తమ రూపంలోనే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఈ విల్లాలోని ప్రతి వస్తువు తమ ఇంట్లో ఉన్నట్లుగానే ఉంటాయి.
తమలాగే ఉన్న వారిని చూసి భయపడిపోయిన వసంత్, అరణ్య గేటెడ్ కమ్యూనిటీ నుంచి పారిపోవాలని అనుకుంటారు. ఎన్నిసార్లు ప్రయత్నించిన తమ విల్లా దగ్గరే వచ్చి ఆగిపోతుంటారు.
అనుకోకుండా అరణ్య కనిపించకుండాపోతుంది. ఆమె మిస్సింగ్‌కు వసంత్ కారణమని పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళతారు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ విల్లాలో ఏం జరుగుతుంది? వసంత్, అరణ్య రూపురేఖలతో ఉన్నవాళ్లు ఎవరు? ఈ మిస్టరీకి 1964 కాలంలో మనోహర్ అనే వ్యక్తి చేసిన హత్యలకు సంబంధం ఏమిటి? తన భార్యను వసంత్ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే బ్లాక్ మూవీ కథ.
హాలీవుడ్‌లోనే ఎక్కువ...
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లతోనే హాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు తెరకెక్కుతోంటాయి. ఈ కాన్సెప్ట్ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీగా, కన్వీన్సింగ్‌గా చెప్పడంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయడానికి మన దర్శకనిర్మాతలు సంకోచిస్తుంటారు.
బ్లాక్ మూవీతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే టైమ్ ట్రావెల్ కథతో ప్రేక్షకులను మెప్పించాడు కేజీ సుబ్రమణి. టైమ్ ట్రావెల్ కారణంగా ఓ జంట జీవితంలో ఎలాంటి గందరగోళం నెలకొంది. కాలంలో వెనక్కి ముందుకు ప్రయాణిస్తూ వారు పడిన సంఘర్షణ, భయం నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా ఈ మూవీ సాగుతుంది.
పీరియాడికల్ సీన్‌తో...
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో బ్లాక్ మూవీ మొదలవుతుంది. ఓ మర్డర్ సీన్‌తోనే ఇది రెగ్యులర్ మూవీ కాదని హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఆ తర్వాత వసంత్, అరణ్యపాత్రల పరిచయం, విల్లాలోకి వారు అడుగుపెట్టే వరకు రొటీన్‌గా ఈ మూవీ సాగుతుంది. ఎప్పుడైతే వారు విల్లాలోకి అడుగుపెట్టారో అక్కడి నుంచే దర్శకుడు మ్యాజిక్ కనిపిస్తుంది.
తమ పోలికలతోనే ఉన్న వ్యక్తులను చూసి వసంత్, అరణ్య భయపడిపోవడం, వారితో మాట్లాడటానికి ప్రయత్నించే సీన్స్‌తో సస్పెన్స్‌ను క్రియేట్ చేశాడు. హారర్, సూపర్ నాచురల్ ఎలిమెంట్ ఏదో ఉంటుందనే ఉత్కంఠను ఆడియెన్స్‌లో కలిగించాడు. చీకటి ప్రదేశంలో కారణంగానే తాము కాలంలో ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, ఆ ప్లేస్ కారణంగా వారిద్దరు ఒకరికొకరు ఎలా దూరమయ్యారనే సీన్స్ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి.
ఫిజిక్స్ క్లాస్...
టైమ్ లూప్ వెనకున్న అసలు ట్విస్ట్‌లో మాత్రం ఆసక్తి లోపించింది. బ్రిటీష్ కాలంలో ఆ ప్లేస్‌లో ఏదోపరిశోధనలు జరిగాయని మాత్రమే చూపించాడు. క్వాంటమ్ ఫిజిక్స్, పారాలాల్ రియాలిటీ...అంటూ ఫిజిక్స్ పాఠం వివరిస్తున్నట్లుగా వివేక్ ప్రసన్న పాత్ర ద్వారా మెయిన్ ట్విస్ట్‌ను రివీల్ చేశాడు. ఆ ఎపిసోడ్ కాస్త గజిబిజిగా అనిపిస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోని, చివరకు అరణ్యను వసంత్ కలుసుకోవడం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది.
రిపీటెడ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. చూసిందే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సైంటిఫిక్ సినిమాల్లో లాజిక్‌లు ఉండవని సర్ధిచెప్పుకుంటే అవన్నీ పెద్దగా ఇబ్బందిగా అనిపించకపోవచ్చు
ఇద్దరు మాత్రమే...
సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్స్ చుట్టూ ఒకే విల్లాలో సాగుతుంది. ఇద్దరు పోటీపడి నటించారు. వాస్తవానికి, ఉహలకు మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో జీవా వేరియషన్ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది గెస్ట్ రోల్స్ మాత్రమే.
కొత్తదనం కోరుకునేవారికి
కాన్సెప్ట్ పరంగా కొత్తదనం కోరుకునే ఆడియెన్స్‌ను బ్లాక్ మెప్పిస్తుంది. టైమ్ ట్రావెల్ పాయింట్ కాస్త గందరగోళంగానే అనిపించిన చివరి వరకు మూవీ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.