తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Ravipudi: అనిల్ రావిపూడి బాబాయి చేసిన‌ సినిమాలు ఇవే - ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌!

Anil Ravipudi: అనిల్ రావిపూడి బాబాయి చేసిన‌ సినిమాలు ఇవే - ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌!

17 January 2025, 13:25 IST

google News
  • సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎనిమిదో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లో అప‌జ‌య‌మే లేని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. అనిల్ రావిపూడి ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి త‌మ్ముడు డైరెక్ట‌ర్ అరుణ్ ప్ర‌సాద్ కార‌ణం. ఎలా అంటే?

అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి

సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీతో టాలీవుడ్‌లో వ‌రుస‌గా ఎనిమిదో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. రాజ‌మౌళి త‌ర్వాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అప‌జ‌య‌మే లేని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెంక‌టేష్ హీరోగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో తొలుత లాభాల్లోకి అడుగుపెట్టిన మూవీగా నిలిచింది.

డైలాగ్ రైట‌ర్‌గా...

సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. ప‌టాస్‌తో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. డైరెక్ట‌ర్ కాక ముందు డైలాగ్, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గాప‌లు సినిమాల‌కు ప‌నిచేశాడు. కంగువ ద‌ర్శ‌కుడు శివ రూపొందిన తెలుగు సినిమాలు శంఖం, ద‌రువు సినిమాల‌కు అనిల్ రావిపూడి డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్ పోతినేని కందిరీగ‌, మ‌హేష్‌బాబు ఆగ‌డుతో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ప‌నిచేశాడు. ఆ అనుభ‌వంతోనే ప‌టాస్‌తో డైరెక్ట‌ర్‌గా మారాడు

పీఏ అరుణ్ ప్ర‌సాద్‌...

అనిల్ రావిపూడి బాబాయి పీఏ అరుణ్ ప్ర‌సాద్ టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్‌గా ప‌లు సినిమాలు చేశాడు. ఆయ‌న స్ఫూర్తితోనే అనిల్ రావిపూడి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు. పీఏ అరుణ్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గౌత‌మ్ ఎస్ఎస్‌సి సినిమాతో అప్రెంటిస్‌గా అనిల్ రావిపూడి సినీ జ‌ర్నీ మొద‌లైంది.

ద‌ళ‌ప‌తి విజ‌య్, కిచ్చా సుదీప్‌...

అనిల్ రావిపూడి బాబాయ్ పీఏ అరుణ్ ప్ర‌సాద్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌ళ‌ప‌తి విజ‌య్‌, కిచ్చా సుదీప్ వంటి సౌత్ సూప‌ర్‌ స్టార్స్‌తో సినిమాలు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌మ్ముడుతోనే పీఏ అరుణ్ ప్ర‌సాద్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్పోర్ట్స్ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన త‌మ్ముడు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ద్రి...

త‌మ్ముడు సినిమాను త‌మిళంలో బ‌ద్రి పేరుతో రీమేక్ చేశారు పీఏ అరుణ్ ప్ర‌సాద్‌. ఈ రీమేక్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించ‌డం గ‌మ‌నార్హం. థియేట‌ర్ల‌లో వంద రోజుల‌కుపైగా బ‌ద్రి మూవీ ఆడింది. క‌న్న‌డంలో కిచ్చా సుదీప్‌తో చందు, కిచ్చా సై సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు ద‌ర్శ‌కుడిగా పీఏ అరుణ్ ప్ర‌సాద్‌కు క‌న్న‌డంలో మంచి పేరు తెచ్చిపెట్టాయి.

టాలీవుడ్‌కు దూరం...

ఆ త‌ర్వాత గౌత‌మ్ ఎస్ఎస్‌సి, యాగం, చ‌ట్టంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. అవేవి అరుణ్ ప్ర‌సాద్‌కు విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. న‌వ‌దీప్‌, భూమిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన యాగం సినిమాకు ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు అరుణ్ ప్ర‌సాద్‌. వ‌రుస ప‌రాజ‌యాల కార‌ణంగా టాలీవుడ్‌కు దూర‌మ‌య్యారు. 2018లో వ‌చ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పీఏ అరుణ్ ప్ర‌సాద్ చివ‌రి మూవీ కావ‌డం గ‌మ‌నార్హం.

స్ఫూర్తి..ప్రోత్సాహం...

పీఏ అరుణ్ ప్ర‌సాద్ అందించిన స్ఫూర్తి, ప్రోత్సాహమే త‌న‌ను ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేలా చేసింద‌ని ప‌లు మూవీ ప్ర‌మోష‌న్స్‌లో అనిల్ రావిపూడి చెప్పారు. అనిల్ రావిపూడి వ‌రుస విజ‌యాల‌తో ఫెయిల్యూర్ లేని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటే...అత‌డి బాబాయ్ మాత్రం ఫెయిల్యూర్స్‌తో ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు.

తదుపరి వ్యాసం