Amaran OTT Release Date: అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే వస్తున్న సాయి పల్లవి మూవీ
29 November 2024, 13:05 IST
Amaran OTT Release Date: అమరన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ముందుగా అనుకున్నదాని కంటే ఒక వారం ముందుగానే వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే వస్తున్న సాయి పల్లవి మూవీ
Amaran OTT Release Date: సాయి పల్లవి, శివకార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అమరన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే దీపావళికి రిలీజై సంచలన విజయాలు సాధించిన రెండు తెలుగు సినిమాలు ఓటీటీలోకి వచ్చేయగా.. అమరన్ మాత్రం కాస్త ఆలస్యమైంది. అయితే ఇప్పుడు కూడా అనుకున్నదాని కంటే వారం ముందుగానే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్
అమరన్ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న రిలీజైన విషయం తెలిసిందే. ఊహించని విధంగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించడంతో సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.320 కోట్లు వసూలు చేసిన అమరన్ మూవీ మొత్తానికి డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ తో ధృవీకరించాయి.
"అవును, అమరన్ నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది" అని ఆ వర్గాలు చెప్పాయి. నిజానికి డిసెంబర్ 11 నుంచి ఈ మూవీ వస్తుందని భావించారు. కానీ వారం ముందుగానే వస్తున్నట్లు ఇప్పుడు కన్ఫమ్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అమరన్ మూవీతో తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
అమరన్ ఓటీటీ హక్కులు
అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర విషయంలోనూ పలు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీని ఏకంగా రూ.60 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
థియేటర్లలో రిలీజైన ఐదు వారాల తర్వాత డిజిటల్ ప్రీమియర్ చేయాలన్న నిబంధనతో డిసెంబర్ 5న మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంటే మరో వారంలోపే ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు.
అమరన్ మూవీ గురించి..
అమరన్ మూవీ ముకుంద్ వరదరాజన్ అనే ఓ ఆర్మీ మేజర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో కమల్ హాసన్ మూవీని నిర్మించగా.. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశాడు.
ఇక మూవీ సక్సెస్ తర్వాత ఈ మధ్యే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ.. శివకార్తికేయన్ ను సన్మానించింది. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా మేజర్ ముకుంద్ వరదరాజన్ ప్రయాణం మొదలైంది చెన్నైలోని ఈ ఓటీఏలోనే. దీంతో ఆ అకాడెమీ మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ శివకార్తికేయన్ ను సన్మానించింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడాడు.
"మేజర్ ముకుంద్ పాత్ర పోషించడం ఓ గౌరవం. ఈ కథను నేను పూర్తిగా కనెక్ట్ అయ్యాను. ఈ గుర్తింపు నాకు చాలా గొప్పది. నిజ జీవిత హీరోల స్టోరీలు చెప్పడం ఎంత ముఖ్యమో ఇది నిరూపిస్తోంది" అని అతడు అన్నాడు.