తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jharkhand Assembly Elections : ఈసారి జార్ఖండ్‌లో జెండా పాతేది ఎవరో? ఇక్కడ సీఎం సీటు ఎప్పుడూ ఆసక్తికరమే

Jharkhand Assembly Elections : ఈసారి జార్ఖండ్‌లో జెండా పాతేది ఎవరో? ఇక్కడ సీఎం సీటు ఎప్పుడూ ఆసక్తికరమే

Anand Sai HT Telugu

22 November 2024, 13:05 IST

google News
    • Jharkhand Politics : జార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ఒకరు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అంతా ఐదేళ్ల కాలం పూర్తిగా పని చేయలేదు.
జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు

బీహార్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటికీ రాజకీయంగా జార్ఖండ్‌లో ఎప్పుడు ఆసక్తికర విషయాలు జరుగుతూనే ఉంటాయి. జార్ఖండ్‌లో సోరెన్ కుటుంబం రాజకీయంగా బలంగా ఉంది. ఇక్కడ ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇప్పటివరకు ఎవరికీ మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ మూడుసార్లు, జార్ఖండ్ ముక్తి మోర్చా రెండుసార్లు అధికారంలోకి వచ్చాయి. శిబు సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చాకు కాంగ్రెస్, ఆర్జేడీ వంటి మిత్రపక్షాలు ఉండగా, బీజేపీ, జేడీయూవంటి పార్టీలు కలిసి పోటీలో ఉన్నాయి.

2000లో బీహార్ నుండి రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఏడుగురు రాజకీయ నాయకులు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఒక్క రఘుబర్ దాస్ మాత్రమే వరుసగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. మిగిలినవారు రోజుల వ్యవధిలోనే సీఎం పీఠం దిగుతూ.. మళ్లీ ఎక్కుతూ నెట్టుకురావాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికైన ఐదు అసెంబ్లీల్లో ఏ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేదు. రాష్ట్రంలో బీజేపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) ఆధిపత్య రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి.

జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కావాలనే పోరాటంతో శిబు సోరెన్ నిరంతర పోరాటాల ద్వారా ఎదిగారు. సొంత పార్టీతో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తర్వాత మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేశారు. కానీ ఆయనకు కూడా పూర్తి స్థాయి అధికారం ఎప్పుడూ దక్కలేదు.

ఆయన తర్వాత కుమారుడు హేమంత్ సోరెన్ కూడా మూడుసార్లు సీఎంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో సీఎంగా ఉండగానే జైలుకు వెళ్లడంతో రాజీనామా చేసి మళ్లీ ఇప్పుడు సీఎం అయ్యారు. జైలులో ఉన్న సమయంలో సీఎంగా ఉన్న చంపై సోరెన్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

మరోవైపు ఇక్కడ బీజేపీ కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ. బాబూలాల్ మరాండీ జార్ఖండ్‌కు తొలి సీఎం. ఆ తర్వాత బీజేపీ నుంచి అర్జున ముండా మూడు సార్లు సీఎం అయ్యి ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఉన్నారు. మధు కోడా సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి అరెస్ట్ అయ్యారు.

గతంలో సీఎంగా ఉన్న రఘుబర్ దాస్  ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నారు. ఈసారి బాబూలాల్ మరాండీ నేతృత్వంలో బీజేపీ మళ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. రెండో దశ పోలింగ్‌లో ప్రధాన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధన్వర్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ, చందన్కియారీ నుండి బీజేపీకి చెందిన అమర్ కుమార్ బౌరి, సిల్లీ నుండి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) అధ్యక్షుడు సుధేష్ మహలాంటి వారు రంగంలో ఉన్నారు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 స్థానాల మెజారిటీ అవసరం. ఈసారి అధికారాన్ని పొందాలని బీజేపీ భావిస్తుండగా, జేఎంఎం కూడా మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. నవంబర్ 23న జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారం ఎవరికి వస్తుందో చూడాలిక..

తదుపరి వ్యాసం