
Delhi Election result Live : బీజేపీదే దిల్లీ పీఠం- కేజ్రీవాల్ ఓటమి! ఆప్ ఢమాల్..
Updated Feb 08, 2025 03:00 PM IST
- Delhi Election result Live : దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం! దిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ పేజ్ని ఫాలో అవ్వండి.
కాంగ్రెస్ హ్యాట్రిక్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధించింది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్.. 2025 ఎన్నికల్లోనూ ఆ ట్రెండ్ ను కొనసాగించి, జీరో స్థానాలతో హ్యాట్రిక్ సాధించింది. అంతకుముందు, 1998 నుంచి 2013 వరకు కాంగ్రెస్ 15 సంవత్సరాల పాటు వరుసగా అధికారంలో కొనసాగింది.
ఆప్ ఓటమిపై అన్నా హజారే స్పందన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ కు ఒకప్పుడు మార్గదర్శకుడిగా ఉన్న సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. లిక్కర్ పాలసీతో పాటు, ప్రజా సంక్షేమంపై కాకుండా సంపాదనపై దృష్టి పెట్టడం వల్ల ఆప్ ఓడిపోయిందని హజారే వ్యాఖ్యానించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ ఎవరో తెలుసా?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో, అందరి దృష్టి పర్వేశ్ వర్మపై పడింది. పర్వేశ్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్. పర్వేశ్ 2013 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లో ఎంపీగా గెలిచారు.
ఆప్ సీఎం అతిషి విజయం
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి 3,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, మాజీ లోక్ సభ ఎంపి రమేష్ బిధురిని ఆమె ఓడించారు. తొలి రౌండ్లలో బిధురి ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరి రౌండ్ల కౌంటింగ్ లో అతిషి ఆధిక్యం సాధించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఓటమి..
దేశ రాజకీయాల్లో మరో కీలక మలుపు! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి అంచున నిలబడ్డారు! తన న్యూ దిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వే వర్మ చేతుల్లో దాదాపు 4వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓటమిని చూడొచ్చు. నిన్న మొన్నటి వరకు విపక్షాల ‘పీఎం అభ్యర్థి’ రేసులో ముందు వరుసలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కి.. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం గమనార్హం.
కార్యకర్తలతో మోదీ భేటీ..
దిల్లీ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో శనివారం రాత్రి 7.30 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఆప్‌కి ఊరట!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాభవంలో ఆప్‌కి ఊరట! దిల్లీ సీఎం, ఆప్ కీలక నేత అతిషి.. కల్కాజి నియోజకవర్గం నుంచి 3వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
శిశోడియా ఓటమి..
దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియా ఓడిపోయారు. జంగ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అధ్యర్థి తర్విందర్ సింగ్ గెలిచారు.
నిర్మల చేసిన ఆ ఒక్క పనితో..!
దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం! దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌కి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి అంచున నిలబడింది. ఆప్ కంచుకోటపై జెండా ఎగరేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడుకుంటున్నారు. రూ. 12లక్షల ఆదాయంపై సున్నా ట్యాక్స్ అంటూ.. బడ్జెట్ 2025లో ఆమె చేసిన ప్రకటన, ఇప్పుడు దిల్లీ ఎన్నికల్లో బీజేపీకి వరంగా మారిందని అభిప్రాయపడుతున్నారు.
మళ్లీ వెనుకంజలోకి కేజ్రీవాల్..
న్యూ దిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు. బీజేపీ అభ్యర్థి లీడింగ్‌లో ఉండగా దాదాపు 250 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉన్నారు.
అటు దిల్లీ సీఎం అతిషి సైతం తన కల్కాజి నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు.
భారీ లీడ్‌లో బీజేపీ!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మళ్లీ పుంజుకుంది. 43 చోట్ల లీడ్‌లో కొనసాగుతోంది. ఆప్ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఒక్క సీటులో కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు.
అంతకంతకు పడిపోతున్న బీజేపీ లీడ్!
బీజేపీ ఉదయం నుంచి పోగుచేసుకున్న లీడ్ అంతకంతకు పడిపోతోంది! ప్రస్తుతం 40 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆప్ 30 చోట్ల లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ ఉన్న ఒక్క సీటు లీడ్‌ని కూడా కోల్పోయింది.
ఒమర్ అబ్దుల్లా సెటైర్..
దిల్లీ ఎన్నికల్లో ఆప్ ప్రదర్శన నేపథ్యంలో జమ్ముకశ్మీర్ సీఎం, విపక్ష ఇండియాలో కీలక నేత ఒమర్ అబ్ధుల్లా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “ఇంకా గొడవపడండి” అంటూ ఆప్, కాంగ్రెస్‌ని పరోక్షంగా ఉద్దేశించిన ఆయన ట్వీట్ చేశారు.
Delhi Election result Live : సర్వత్రా ఉత్కంఠ!
దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతసేపటి క్రితం వరకు 50 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న బీజేపీ.. ఉదయం 10 గంటల సమయానికి 40 స్థానాలకు పడిపోయింది. అదే సమయంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 30 చోట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మెజారిటీ మార్క్ అయిన 36కి రెండు పార్టీలు చాలా దగ్గరగా ఉన్నాయి.
వెనుకంజలో మనీశ్ శిశోడియా..
దిల్లీ మజీ డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియా వెనుకంజలో ఉన్నారు. జాన్పురాలో త్రివేందర్ సింగ్ లీడింగ్‌లో ఉన్నారు.
లీడింగ్‌లోకి కేజ్రీవాల్!
ఇంతసేపు వెనుకంజలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు లీడింగ్‌లోకి వచ్చారు. కానీ న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పర్వేష్కి కేజ్రీవాల్‌కి ఇంకా స్వల్ప తేడా మాత్రమే ఉంది.
Delhi election results : బీజేపీ- ఆప్ మధ్య చాలా వ్యత్యాసం..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 47 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్లలో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ మొదటి నుంచి 1 సీటుకే పరిమితమైంది.
Delhi Election results : ఇంకా వెనుకంజలోనే కేజ్రీవాల్!
ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన గంట తర్వాత కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి పర్వేష్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Delhi Election result : మెజారిటీ మార్క్ దాటేసిన బీజేపీ!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. మాజిక్ ఫిగర్ 36 కాగా, కమలదళం ఇప్పటికే 45 చోట్ల ఆధిక్యంలో ఉంది.
Delhi elections : ఆధిక్యంలో బీజేపీ..
ఉదయం 9 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం దిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం 42 చోట్ల కమలదళం ఆధిక్యంలో ఉంది. ఆప్ 28 చోట్ల, కాంగ్రెస్ 1 స్థానంలో లీడింగ్‌లో ఉంది.
Delhi Election result Live : వెనకంజలో కేజ్రీవాల్!
ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ ముందంజలో ఉన్నారు.
కేజ్రీవాల్ మాత్రమే కాదు దిల్లీ ప్రస్తుత సీఎం అతిషి (కల్కజి), మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియా (జంగ్‌పురా)లో వెనకంజలో ఉన్నారు.
Delhi election results : ఎర్లీ ట్రెండ్స్‌లో ఆప్ వెనకంజ..
ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 34 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వెనకపడింది. కేవలం 18 చోట్ల లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ 1 చోట ముందంజలో ఉంది.
Delhi election results : ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ హవా!
ఉదయం 8 గంటలకు దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవ్వగా.. మొదటి నుంచి బీజేపీ హవా కనిపిస్తోంది. ఉదయం 8 గంటల 15 నిమిషాల సమయానికి కమలదళం 15 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. మరోవైపు ఆప్ 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు.
Delhi Election result Live : కౌంటింగ్ షురూ..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 70 సీట్లు ఉన్నాయి. కౌంటింగ్ కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కట్టుదిట్ట భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది.
Delhi election result : ఆప్ వర్సెస్ కాంగ్రెస్..
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగంగా కలిసి పనిచేసిన ఆప్, కాంగ్రెస్‌లు.. 2025 దిల్లీ అసెంబ్లీ విషయంలో మాత్రం ప్రత్యర్థులుగా మారాయి. కేజ్రీవాల్, రాహుల్ గాంధీలు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. మరి వీటిని ప్రజలు ఏ విధంగా పరిగణిస్తారో చూడాలి.
Delhi election result : దిల్లీ పీఠం బీజేపీని వరిస్తుందా?
దేశంపై పట్టు సాధించిన బీజేపీ 'దిల్లీ' కల మాత్రం ఇంకా నెరవేరలేదు! ఇక్కడ కమలదళం జెండా ఎగిరి, 26ఏళ్లు దాటిపోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు కాస్త సానుకూలంగా కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌పై అనినీతి అరోపణలు సహా ఇతర కీలక అంశాలు బీజేపీకి కలిసి వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీ గెలుపును అంచనా వేశాయి.
Delhi election result live : ఆప్ సునామీ.. మరోసారి?
2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటినీ ఓడించి, 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలను గెలుచుకున్న ఆప్.. దిల్లీ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటిచెప్పింది.
ఇక 2020లో ఆ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 62 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ను ఓడించింది. ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాలి..
Delhi election result : కేజ్రీవాల్‌కి పోటీగా ఆ ఇద్దరు.. గెలుపొవరిది?
అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూ దిల్లీ నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేజ్రీవాల్‌ని ఓడించేందుకు పర్వేష్ సింగ్ వర్మను బీజేపీ రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సందీప్ దీక్షిత్ పోటీ చేశారు.
Delhi Election results : అరవింద్ కేజ్రీవాల్‌కి డూ ఆర్ డై!
ఈ దఫా దిల్లీ అసెంబ్లీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి డూ ఆర్ డైగా మారాయి. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో జైలుకు వెళ్లిన ఆయన, బయటకు వచ్చిన అనంతరం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తన నిజాయతీని చూసి ప్రజలే తనని గెలిపిస్తారని చెబుతూ వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆప్‌కి సానుకూలంగా లేని నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ పార్టీ ఓటమి ఖాయమేనా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
Delhi Election results : కట్టుదిట్ట భద్రత మధ్య కౌంటింగ్..
దిల్లీలో కట్టుదిట్ట భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 10వేల మంది పోలీసులు ఎలక్షన్ డ్యూటీ చేయనున్నారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో పారామిలిటరీ దళాలు కూడా విధులు నిర్వర్తించనున్నాయి.
Delhi election result : గత ఎన్నికల ఫలితాలు..
2020లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దుమ్మురేపింది! 70 సీట్లల్లో 62 చోట్ల విజయం సాధించింది. బీజేపీకి కేవలం 8 సీట్లే వచ్చాయి. గతంలో 15ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా రాలేదు.
Delhi Election result Live : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయి?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గత మూడు ఎన్నికల్లో గెలిచి దిల్లీకి సీఎం అయ్యారు. నాలుగోసారి సైతం పార్టీని గెలిపించేందుకు కృషి చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్‌కి ఛాన్స్ ఇవ్వలేదు! దిల్లీలో ఈసారి గెలిచేది బీజేపీనే అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.
Delhi Election result Live : ఎన్నికల్లో గెలవాలంటే..
శనివారం ఉదయం 8 గంటలకు 19 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఫలితాలు వెలువడతాయి. కాగా, 70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 36గా ఉంది.
Delhi Election results : దిల్లీ పీఠం ఎవరిది?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దిల్లీని మూడోసారి దక్కించుకోవాలని ఆప్ చూస్తుంటే, అరవింద్ కేజ్రీవాల్‌కి అడ్డుకట్ట వేయాలని బీజేపీ అన్ని విధాలుగా కృషి చేసింది. మరి ప్రజలు ఎవరికి ఓటు వేశారు? అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.