తెలుగు న్యూస్  /  క్రికెట్  /  విండీస్ డేంజరస్ ప్లేయర్ రిటైర్మెంట్.. లాస్ట్ మ్యాచ్ లోనూ సిక్సర్ల ఊచకోత.. కొడితే సైట్ స్క్రీన్ పగిలింది

విండీస్ డేంజరస్ ప్లేయర్ రిటైర్మెంట్.. లాస్ట్ మ్యాచ్ లోనూ సిక్సర్ల ఊచకోత.. కొడితే సైట్ స్క్రీన్ పగిలింది

Published Jul 23, 2025 01:04 PM IST

google News
  • వెస్టిండీస్ డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. చివరగా ఆస్ట్రేలియాతో టీ20 ఆడేశాడు. ఈ మ్యాచ్ లోనూ అతను సిక్సర్ల ఊచకోత కోశాడు. ఓ బంతి తాకడంతో సైట్ స్క్రీన్ పగిలింది. 
ఆండ్రీ రసెల్ (AFP)

ఆండ్రీ రసెల్

వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. చివరగా ఆస్ట్రేలియాతో టీ20తో అతను కెరీర్ ముగించాడు. లాస్ట్ అంతర్జాతీయ మ్యాచ్ లోనూ సిక్సర్ల మోత మోగించాడు. వెస్టిండీస్ సహచరులు, ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.


చివరి మ్యాచ్

రసెల్ చివరిసారిగా వెస్టిండీస్ జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు. జమైకా క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఒలివియా గ్రేంజ్ అతనికి జ్ఞాపికను అందజేశారు. ఇది ఒక ప్రత్యేక ఆటగాడికి ప్రత్యేక సందర్భం. గంట తర్వాత, టీ20 క్రికెట్లో లెజెండ్‌గా ఎదిగిన ఆండ్రీ రసెల్ తాను ఎందుకు అంతర్జాతీయంగా సూపర్‌స్టార్‌నో అని చూపించాడు.

మూడు సిక్సర్లు

వెస్టిండీస్ 14వ ఓవర్లో 98 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన రస్సెల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో సింగిల్ తీసి ఖాతా తెరిచాడు. ఆ తర్వాత బెన్ డ్వార్షుయిస్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. అందులో మొదటిది నేరుగా గ్రౌండ్ మీదుగా వెళ్లి సైట్ స్క్రీన్‌కు హోల్ చేసింది. బంతి అందులోనే ఇరుక్కుపోయింది. చివరకు ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ గ్రౌండ్ సిబ్బంది సహాయంతో దానిని బయటకు తీశాడు.

బాదుడే

తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనూ రసెల్ బాదుడు కొనసాగించాడు. 16వ ఓవర్లో జంపా బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్ కొట్టి ఒత్తిడి పెంచాడు. రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన రస్సెల్ తన కండ బలంతో బంతిని బాదాడు. రసెల్ రెండుసార్లు ఫ్రంట్ ఫుట్‌పై ఆడతాడని జంపా భావించి పొరపాటు చేశాడు. రసెల్ ఆడిన తొలి తొమ్మిది బంతుల్లో ఐదు బంతులు బౌండరీకి వెళ్లాయి. అందులో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. చివరకు ఎలీస్ బౌలింగ్ లో రసెల్ ఔటయ్యాడు. 15 బంతుల్లో 36 పరుగులు చేసిన రసెల్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఓటమితో వీడ్కోలు

ఆస్ట్రేలియా ఫీల్డర్లు ఒక్కొక్కరుగా అతనితో కరచాలనం చేస్తుండగా, రసెల్ తన బ్యాట్‌ను పైకి ఎత్తాడు. ఆండ్రీ రసెల్ చివరి కోరిక నెరవేరకుండా ఆసీస్ అడ్డుకుంది.

"ఓటమి తో నా అంతర్జాతీయ కెరీర్ ముగించకూడదు అనుకుంటున్నా. అది నాకు, వెస్టిండీస్‌కు ముఖ్యం. నా అంతర్జాతీయ కెరీర్‌ను విజయంతో ముగించాలని ఉంది. చివరిసారిగా మైదానంలోకి వెళ్లినప్పుడు కొంచెం భావోద్వేగానికి గురయ్యా. కానీ నా పనిపై దృష్టి పెట్టాను. మీరు సానుకూల దృక్పథంతో ఉంటే, సిక్సర్లు కొట్టడం సులభం అవుతుంది. సిక్సర్లు కొట్టడం ఆనందంగా ఉంది" అని ఇన్నింగ్స్ విరామంలో రసెల్ అన్నాడు.

కానీ జోష్ ఇంగ్లీష్, కామెరాన్ గ్రీన్ మెరుపు హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా 15.2 ఓవర్లలో వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రసెల్ వేసిన ఒకే ఒక్క ఓవర్లో వికెట్ తీయకుండా 16 పరుగులు ఇచ్చాడు.