తెలుగు న్యూస్  /  క్రికెట్  /  27 పరుగులకే ఆలౌట్.. టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు.. లోయెస్ట్ రికార్డు ఎంతో తెలుసా?

27 పరుగులకే ఆలౌట్.. టెస్టుల్లో రెండో అత్యల్ప స్కోరు.. లోయెస్ట్ రికార్డు ఎంతో తెలుసా?

Published Jul 15, 2025 10:19 AM IST

google News
  • వెస్టిండీస్ ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్లో ఓ అవమానకర ఫీట్ నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ లో ఓ ఇన్నింగ్స్ లో 27 పరుగులకే కుప్పకూలింది. మరి టెస్టు ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోరు రికార్డు ఎవరిదంటే? 
వికెట్ తీసిన ఆనందంలో బోలాండ్ (AP)

వికెట్ తీసిన ఆనందంలో బోలాండ్

వెస్టిండీస్ క్రికెట్ జట్టు టెస్టుల్లో చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో రెండో అత్యల్ప స్కోరు రికార్డును విండీస్ మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఈ కరీబియన్ టీమ్ కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. అయితే ఓ టెస్టు ఇన్నింగ్స్ లో అతి తక్కువ స్కోరు రికార్డు న్యూజిలాండ్ పేరు మీద ఉంది. 1955లో ఆక్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ 26 పరుగులే చేసింది.


87 బంతుల్లోనే

వెస్టిండీస్ తో డేనైట్ టెస్టులో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. రెండో ఇన్నింగ్స్ లో విండీస్ ను కుప్పకూల్చారు. టెస్ట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా కేవలం 87 బంతుల్లోనే విండీస్ చివరి ఇన్నింగ్స్‌ను ముగించింది. కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్ట్‌లో ఆసీస్ 176 పరుగుల తేడాతో గెలిచింది.

స్టార్క్ రికార్డు

తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్.. ఈ ఫార్మాట్ చరిత్రలో వేగవంతమైన ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 15వ ఐదు వికెట్ల హాల్. ఇన్నింగ్స్ తొలి బంతికే జాన్ కాంప్‌బెల్‌ను అవుట్ చేసి, ఆ తర్వాత కెవ్లాన్ అండర్సన్, బ్రాండన్ కింగ్‌లను ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. వరుసగా రెండో మెయిడిన్ ఓవర్ వేసిన తర్వాత, స్టార్క్ తన మూడో ఓవర్ మొదటి బంతికి మైకిల్ లూయిస్‌ను అవుట్ చేసి షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లియోన్ వంటి ప్రముఖుల జాబితాలో చేరాడు. వెస్టిండీస్ బ్యాటర్ షై హోప్ రెండు పరుగులు తీయడంతో జట్టు పరుగుల ఖాతా తెరిచింది. ఆ తర్వాత స్టార్క్ అతడిని కూడా పెవిలియన్ చేర్చాడు.

బోలాండ్ హ్యాట్రిక్

ఈ ఇన్నింగ్స్ లో బోలాండ్ హ్యాట్రిక్ నమోదు చేయడం మరో విశేషం. బోలాండ్ వరుసగా జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసెఫ్, జోమెల్ వారిక్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాకు ఇది 10వ టెస్ట్ హ్యాట్రిక్. చివరగా జేడెన్ సీల్స్‌ను అవుట్ చేయడం ద్వారా స్టార్క్ 6 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ 27 పరుగులకే కుప్పకూలింది. ఇది వారి అత్యల్ప టెస్ట్ స్కోరు. 14వ ఓవర్‌లో 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ మిస్‌ఫీల్డ్ చేయడంతో వెస్టిండీస్ ఒక పరుగు తీసి 27 పరుగులు చేసింది.