తెలుగు న్యూస్  /  క్రికెట్  /  రసెల్ బ్యాట్ తో రప్పా రప్పా.. విండీస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన టిమ్ డేవిడ్.. 37 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు

రసెల్ బ్యాట్ తో రప్పా రప్పా.. విండీస్ బౌలింగ్ ను ఊచకోత కోసిన టిమ్ డేవిడ్.. 37 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు

Published Jul 26, 2025 02:48 PM IST

google News
  • ఆస్ట్రేలియా డేంజరస్ ప్లేయర్ టిమ్ డేవిడ్ అదరగొట్టాడు. వీర విధ్వంసం సృష్టించాడు. 37 బాల్స్ లోనే హండ్రెడ్ తో హిస్టరీ క్రియేట్ చేశాడు. విండీస్ ను ఉతికారేశాడు. అయితే విండీస్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ బ్యాట్ తోనే డేవిడ్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం విశేషం. 
టిమ్ డేవిడ్

టిమ్ డేవిడ్

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు. స్టేడియంలో విధ్వంసం సృష్టించాడు. 11 సిక్సర్లతో వెస్టిండీస్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. 37 బంతుల్లోనే శతకంతో హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ గా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ తో శనివారం (జులై 25) జరిగిన మూడో టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. విండీస్ బ్యాటర్ రసెల్ బ్యాట్ తోనే అదే టీమ్ పై టిమ్ డేవిడ్ చెలరేగడం విశేషం.


మెరుపులే మెరుపులు

మిడిల్ఆర్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ శనివారం T20Iలలో ఆస్ట్రేలియా తరఫున వేగవంతమైన సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 37 బంతుల్లో 102 పరుగులు చేసి, వార్నర్ పార్క్ స్టేడియాన్ని ఊపేశాడు. దీంతో సెయింట్ కిట్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 23 బంతులు మిగిలి ఉండగానే 215 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది.

ఈ విజయంతో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. టిమ్ డేవిడ్ కు ఇదే ఫస్ట్ టీ20 సెంచరీ. ఓవరాల్ గా అంతర్జాతీయ టీ20ల్లొ టెస్టు ఆడే దేశాల మ్యాచ్ ల్లో మూడో ఫాస్టెస్ సెంచరీ.

బాదుడే పనిగా

ఈ ఏడాది ఐపీఎల్ విన్నింగ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన టిమ్ డేవిడ్.. విండీస్ ఛేజింగ్ లో మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆరో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. డేవిడ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టాడు. అతను ఏ బౌలర్‌ను విడిచిపెట్టలేదు. గుడకేష్ మోతీకి వరుసగా నాలుగు సిక్సర్లతో చుక్కలు చూపించాడు. డేవిడ్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక లైఫ్ వచ్చింది. ఛాన్స్ ను ఉపయోగించుకుని సెంచరీ బాదేశాడు.

రికార్డు భాగస్వామ్యం

షార్టెస్ట్ ఫార్మాట్‌లో ఫినిషింగ్ సామర్థ్యానికి పేరుగాంచిన డేవిడ్ ఎక్కువసేపు క్రీజులో ఉండి విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. డేవిడ్, మిచెల్ ఓవెన్ ఐదవ వికెట్‌కు అజేయంగా 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది షార్టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు ఐదవ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం. ఓవెన్ 16 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

రసెల్ బ్యాట్

తన అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత, టిమ్ డేవిడ్ వెస్టిండీస్‌తో జరిగిన మూడవ టీ20లో ఆండ్రీ రసెల్ బ్యాట్‌ను ఉపయోగించినట్లు వెల్లడించాడు. సబీనా పార్క్, జమైకాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టీ20 తర్వాత విండీస్ ఆల్ రౌండర్ రసెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

"నేను పవర్ హిట్టింగ్‌పై చాలా సమయం వెచ్చించా. కానీ ఇప్పుడు నా షాట్ సెలక్షన్‌పై దృష్టి పెడుతున్నాను. నేను ఆండ్రీ రస్సెల్ బ్యాట్‌ను ఒక సంవత్సరం పాటు మోస్తున్నా. దానిని ఉపయోగించడానికి ఇది ఉత్తమ సమయం అనిపించింది" అని మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత డేవిడ్ ప్రెజెంటేషన్ వేడుకలో చెప్పాడు.