Tilak Varma: తిలక్ నా రూమ్‌కి వచ్చి మూడో స్థానంలో వెళ్తానని అడిగాడు: సూర్యకుమార్.. అతని త్యాగం ఫలించింది
14 November 2024, 7:16 IST
- Tilak Varma: తిలక్ వర్మ మూడో స్థానంలో వెళ్తానని అడిగినట్లు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. ఆ స్థానంలో వచ్చి, సెంచరీ బాది సౌతాఫ్రికాతో మూడో టీ20లో టీమిండియాను అతడు గెలిపించిన విషయం తెలిసిందే.
తిలక్ నా రూమ్‌కి వచ్చి మూడో స్థానంలో వెళ్తానని అడిగాడు: సూర్యకుమార్.. అతని త్యాగం ఫలించింది
Tilak Varma: సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో రికార్డు సెంచరీ బాదిన తిలక్ వర్మ గురించి మ్యాచ్ తర్వాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. తనను మూడో స్థానంలో పంపించాల్సిందిగా మ్యాచ్ కు ముందు తిలక్ తనను అడిగినట్లు వెల్లడించాడు. తొలి రెండు టీ20ల్లో నాలుగో స్థానంలో వచ్చి 33, 20 పరుగులు చేసిన అతడు.. మూడో స్థానంలో వచ్చి సెంచరీ బాదడం విశేషం.
తిలక్ అడిగాడు.. సూర్య త్యాగం చేశాడు
హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ మినిమం గ్యారెంటీ ప్లేయరే అయినా.. 20, 30 స్కోర్లతో జట్టులో కొనసాగడం అంత సులువు కాదని భావించాడు. దీంతో నాలుగు బదులు మూడో స్థానంలో వెళ్తానని కెప్టెన్ సూర్యను అడగడం, దానికి అతడు అంగీకరించడం.. తిలక్ కే కాదు టీమిండియాకు కూడా కలిసొచ్చింది. సెంచూరియన్ లో సెంచరీతో చెలరేగి.. సౌతాఫ్రికాపై మూడో టీ20లో టీమ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
దీని గురించి మ్యాచ్ తర్వాత సూర్య మాట్లాడాడు. "తిలక్ వర్మ గురించి ఇంకేం చెప్పగలను. అతడు గెబర్హాలో నా గదికి వచ్చి తనకు మూడో స్థానంలో అవకాశం ఇవ్వాలని కోరాడు. బాగా ఆడతానని అన్నాడు. నేను సరే అన్నాను. వెళ్లి చెలరేగిపో అని చెప్పాను. అడిగాడు.. చేసి చూపించాడు. చాలా ఆనందంగా ఉంది" అని సూర్య అన్నాడు. అంతేకాదు టీ20ల్లో ప్రస్తుతానికి మూడో స్థానంలో తిలకే కొనసాగుతాడని కూడా స్పష్టం చేశాడు.
ఈ క్షణం కోసమే వేచి చూశాను: తిలక్
ఈ మ్యాచ్ లో మొదట అభిషేక్ శర్మ 25 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగగా.. తర్వాత తిలక్ రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఇండియా 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 రన్స్ మాత్రమే చేసింది. 11 పరుగులతో గెలిచిన టీమిండియా 4 టీ20ల సిరీస్ లో 2-1 ఆధిక్యం సంపాదించింది.
యశస్వి జైస్వాల్ తర్వాత టీ20ల్లో సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ గా తిలక్ నిలిచాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. "ఈ క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. గాయం నుంచి కోలుకొని వచ్చి సెంచరీ చేయడం అద్భుతం. మేమిద్దరం (అభిషేక్, నేను) చాలా ఒత్తిడిలో ఉన్నాం. ఈ ఇన్నింగ్స్ మా ఇద్దరికీ చాలా ముఖ్యం" అని తిలక్ అన్నాడు.
సౌతాఫ్రికా తరఫున కూడా చివర్లో మార్కో యాన్సెన్ చెలరేగి భయపెట్టినా.. చివరికి ఇండియానే విజయం వరించింది. యాన్సెన్ కేవలం 17 బంతుల్లో 54 రన్స్ చేశాడు. అంతకుముందు క్లాసెన్ 22 బంతుల్లో 41 రన్స్ చేశాడు. ఈ సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగా.. సిరీస్ కోల్పోయే అవకాశం అయితే టీమిండియాకు లేదు. శుక్రవారం (నవంబర్ 14) చివరిదైన నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.