తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India For Ct2025: కరుణ్ నాయర్‌కు చోటు కష్టమేనా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రేపే టీమిండియా ఎంపిక

Team India for CT2025: కరుణ్ నాయర్‌కు చోటు కష్టమేనా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రేపే టీమిండియా ఎంపిక

Hari Prasad S HT Telugu

17 January 2025, 19:34 IST

google News
    • Team India for CT2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎంపిక శనివారం (జనవరి 18) జరగనుంది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగుతున్న కరుణ్ నాయర్ కు చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ నడుస్తోంది.
కరుణ్ నాయర్‌కు చోటు కష్టమేనా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రేపే టీమిండియా ఎంపిక
కరుణ్ నాయర్‌కు చోటు కష్టమేనా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రేపే టీమిండియా ఎంపిక (PTI)

కరుణ్ నాయర్‌కు చోటు కష్టమేనా.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రేపే టీమిండియా ఎంపిక

Team India for CT2025: కరుణ్ నాయర్ తన లైఫ్‌టైమ్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా 752 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అయినా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టులో చోటు దక్కడం కష్టమే అన్న వార్తలు వస్తున్నాయి. ఇండియా టుడేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. కరుణ్ నాయర్ ఎంపిక అనుమానమే.

కరుణ్ నాయర్‌కు మొండిచేయేనా?

2016లో తొలిసారి టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చి ట్రిపుల్ సెంచరీ చేసి.. తర్వాత కనిపించకుండా పోయిన బ్యాటర్ కరుణ్ నాయర్. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ హజారే ట్రోఫీలో మెరుపులతో వార్తల్లోకి వచ్చాడు. ఇప్పటికే ఈ టోర్నీలో ఐదు సెంచరీలు బాదిన అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారా అన్న చర్చ నేపథ్యంలో శనివారం (జనవరి 18) టీమిండియా సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది.

అయితే 33 ఏళ్ల కరుణ్ నాయర్ ను ఎంపిక చేయకపోవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించినట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది. ఎప్పుడో ఎనిమిదన్నరేళ్ల కిందట రెండు వన్డేలు ఆడిన అతడు.. ఇప్పుడు సడెన్ గా మిడిలార్డర్ లో సెట్ కావడం సాధ్యం కాకపోవచ్చని సెలెక్టర్లు భావిస్తున్నట్లు ఆ రిపోర్టు చెప్పింది. 2017లో చివరిసారి టీమిండియాకు ఆడాడు కరుణ్ నాయర్.

బుమ్రా సహా సీనియర్లకు ఛాన్స్?

వచ్చే నెల 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను ఎంపిక చేయడానికి శనివారం (జనవరి 18) మధ్యాహ్నం 12 గంటలకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశంలో 15 మంది సభ్యుల జట్టును అనౌన్స్ చేయనున్నారు.

దీంతోపాటు ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించనున్నారు. శుక్రవారం (జనవరి 17) సాయంత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ తో సెలెక్షన్ కమిటీ వర్చువల్ సమావేశం నిర్వహించినట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది.

ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన బుమ్రా సహా సీనియర్లు కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ లకు జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే బుమ్రా పూర్తి ఫిట్ గా ఉంటేనే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్ తో అతనికి వెన్ను గాయం అయిన విషయం తెలిసిందే.

సంజూ శాంసన్ కూడా డౌటేనా?

కరుణ్ నాయర్ తోపాటు వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను కూడా ఎంపిక చేసే అవకాశం లేనట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మాత్రం సంజూ ఉన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అతడు ఆడటం లేదు.

ట్రైనింగ్ క్యాంప్ కు అతడు రాకపోవడంతో శాంసన్ ను జట్టులోకి ఎంపిక చేయలేదు. ఇండియా చివరిసారి గతేడాది ఆగస్టులో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడింది. 27 ఏళ్ల తర్వాత ఆ జట్టు చేతుల్లో సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ తో సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

తదుపరి వ్యాసం