95 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన శుభ్‌మన్ గిల్.. ఇండియన్ కెప్టెన్ హిస్టరీ అందుకుంటాడా?
Published Jul 10, 2025 01:08 PM IST
- క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డులపై టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కన్నేశాడు. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల్లో అదరగొట్టిన గిల్.. మిగిలిన మూడు టెస్టుల్లోనూ రాణిస్తే 95 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది.
శుభ్‌మన్ గిల్, డాన్ బ్రాడ్‌మాన్
శుభ్‌మన్ గిల్, డాన్ బ్రాడ్‌మాన్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఇప్పటికే 585 పరుగులు చేశాడు. వాటిలో 430 పరుగులు ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో వచ్చాయి. ఈ టెస్టులో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసిన గిల్, ఎడ్జ్‌బాస్టన్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు లెజెండరీ డాన్ బ్రాడ్‌మన్ రికార్డులపై కన్నేశాడు.
నాలుగు రికార్డులు
ఇంగ్లాండ్ తో సిరీస్ లో లెజెండరీ డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన కనీసం నాలుగు ప్రపంచ రికార్డులను శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డులు 95 ఏళ్లుగా కొనసాగుతున్నాయి.
- కెప్టెన్ గా ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగుల రికార్డు బ్రాడ్‌మన్ పేరు మీదే ఉంది. 1936-37 యాషెస్ సిరీస్ లో బ్రాడ్‌మన్ కెప్టెన్‌గా 810 పరుగులు చేశాడు. ఇప్పుడీ రికార్డు బ్రేక్ చేసేందుకు గిల్ 225 పరుగుల దూరంలో ఉన్నాడు.
- కెప్టెన్ గా తొలి టెస్టు సిరీస్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా బ్రాడ్‌మన్ కొనసాగుతున్నాడు. పైన చెప్పిన యాషెస్ సిరీస్ కెప్టెన్ గా బ్రాడ్‌మన్ కు మొదటిది. ఆ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో మూడు సెంచరీలతో 90 సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటికే మూడు సెంచరీలతో ఉన్న గిల్ ఈ ఘనతను సాధించడానికి అవసరమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు.
- టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు కూడా బ్రాడ్‌మన్ ఖాతాలోనే ఉంది. 1930 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌లో అతను 974 పరుగులు చేశాడు. ఆ రికార్డు అందుకోవడానికి గిల్ కు ఇంకా 390 పరుగులు కావాలి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో గిల్ ప్రారంభం బ్రాడ్‌మన్ కంటే బలంగా ఉంది. 1930 సిరీస్‌లోని మొదటి రెండు టెస్టుల్లో ఈ ఆస్ట్రేలియన్ గ్రేట్ 394 పరుగులు చేయగా.. గిల్ ఇప్పటికే 585 పరుగులు చేశాడు.
- కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగుల బ్రాడ్‌మన్ రికార్డునూ గిల్ బ్రేక్ చేసే అవకాశముంది. కేవలం 11 ఇన్నింగ్స్‌లలో అతను ఈ మార్కును చేరుకున్నాడు. గిల్ ఈ మైలురాయిని చేరుకోవడానికి తదుపరి ఆరు ఇన్నింగ్స్‌లలో 415 పరుగులు అవసరం.
- ఇక టెస్టు సిరీస్ లో అత్యధిక సెంచరీల రికార్డునూ గిల్ చేరుకునే అవకాశముంది. వెస్టిండీస్ గ్రేట్ క్లైడ్ వాల్కాట్ 1955లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఐదు సెంచరీలు చేశాడు. గిల్ ఇంకా రెండు సెంచరీలు చేస్తే రికార్డు సమం చేయగలడు.
