ఇండియాపై థ్రిల్లింగ్ విక్టరీ.. అయినా ఇంగ్లాండ్ కు షాక్.. ఐసీసీ ఫైన్.. ఇదే రీజన్
Published Jul 16, 2025 12:55 PM IST
- ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఆ విన్నింగ్ సంతోషం లేకుండా ఇంగ్లిష్ జట్టుపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. భారీ ఫైన్ విధించింది.
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ముగిసే సరికి 2-1తో లీడ్ లో ఉన్న ఇంగ్లాండ్ కు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. థ్రిల్లింగ్ గా సాగిన మూడో టెస్టులో ఇండియాపై ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. లార్డ్స్ లో ముగిసిన ఈ టెస్టులో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, కోపం, నిరాశ, బాధ.. ఇలా ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. చివరకు ఇంగ్లిష్ టీమ్ గెలిచింది. కానీ ఆ టీమ్ కు ఐసీసీ ఫైన్ విధించింది.
ఎందుకంటే?
లార్ట్స్ లో ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ స్లో ఓవర్ రేట్ కొనసాగించింది. నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని జట్టుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు రెండు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లు కోత విధించింది.
రెండు ఓవర్లు
ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ కు చెందిన రిచీ రిచర్డ్ సన్.. సమయాన్ని లెక్కించి అవసరమైన కోటా కంటే ఇంగ్లాండ్ రెండు ఓవర్లు తక్కువ వేసిందని తేల్చాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం సమయానికి బౌలింగ్ చేయని ప్రతి ఓవర్ కు జట్లకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించడంతో పాటు ఒక్కో ఓవర్ కు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వారి మ్యాచ్ ఫీజులో 10% కోల్పోతారు. జట్టు రెండు విలువైన డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోతుంది.
ఒప్పుకొన్న స్టోక్స్
స్లో ఓవర్ రేట్ నేరాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒప్పుకొన్నాడు. స్టోక్స్ నేరాన్ని అంగీకరించాడని, ప్రతిపాదిత శిక్షకు ఒప్పుకొన్నాడని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిసింది. అందుకే దీనిపై అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు పాల్ రీఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఈ స్లో ఓవర్ రేట్ ఫిర్యాదు చేశారు.
ఆల్ రౌండ్ షో
లార్డ్స్ టెస్టులో స్టోక్స్ ఆల్ రౌండ్ షోతో ఇంగ్లాండ్ ను గెలిచించాడు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక సమయంలో చివరి రోజు స్పెల్ లో కేఎల్ రాహుల్ తో సహా మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. బ్యాట్ తోనూ రాణించాడు. భారత్ కు ఇంగ్లాండ్ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇండియా 170 పరుగులకే ఆలౌటైంది. జూలై 23 న మాంచెస్టర్లో నాల్గవ టెస్ట్ ప్రారంభమవుతుంది.
