స్టోక్స్ కు షాక్.. షేక్ హ్యాండ్ ఇవ్వని జడేజా.. జడ్డూ, సుందర్ సూపర్ సెంచరీలు.. అద్భుతంగా పోరాడి డ్రా చేసుకున్న ఇండియా
Published Jul 28, 2025 06:13 AM IST
- ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ కు షాక్ తగిలింది. మాంచెస్టర్ టెస్టులో అయిదో రోజు ఆటలో జడేజా, సుందర్ సెంచరీలకు చేరువగా ఉన్న సమయంలో స్టోక్స్ వచ్చి డ్రాగా ముగిద్దామని చెప్పాడు. కానీ జడేజా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. బ్యాటింగ్ కొనసాగించి జడ్డూ, సుందర్ సెంచరీలు అందుకున్నారు. చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
జడేజాతో స్టోక్స్
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దిమ్మతిరిగే షాకిచ్చాడు. మ్యాచ్ ను ముగించి, డ్రా చేసుకుందామన్న స్టోక్స్ ప్రతిపాదనను తిరస్కరించి బ్యాటింగ్ కొనసాగించాడు. మాంచెస్టర్ టెస్టులో అయిదో రోజు (జులై 27) ఆటలో ఇంకా 15 ఓవర్లు ఉన్నాయనగా.. జడేజా, సుందర్ సెంచరీలు అడ్డుకోవాలని స్టోక్స్ ప్లాన్ చేసినట్లుగా కనిపించింది. కానీ భారత ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు.
మ్యాచ్ ముగిద్దామని
ఇంగ్లాండ్, టీమిండియా మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ లోటుతో వెనుకబడ్డ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా పుంజుకుంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) సూపర్ సెంచరీలతో జట్టును ఓటమి నుంచి తప్పించారు. చివరి రోజు ఎలాగో డ్రా ఖాయమైన పరిస్థితుల్లో మ్యాచ్ ముగిద్దామని స్టోక్స్ అడిగాడు. జడేజా, సుందర్ సెంచరీలు చేయకుముందే ఎండ్ చేద్దామనుకున్నాడు. కానీ అందుకు నో చెప్పిన జడేజా బ్యాటింగ్ కొనసాగించాడు. జడ్డూ, సుందర్ సెంచరీలు చేసుకున్నారు.
జడ్డూతో వాగ్వాదం
చివరి రోజు మరో గంట ఆట మిగిలి ఉండగా స్టోక్స్ జడేజా వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో డ్రామా మొదలైంది. కానీ జడ్డూ అందుకు ఒప్పుకోకపోవడంతో స్టోక్స్ కు షాక్ తగిలింది. అంపైర్లు కూడా దీనికి అనుకూలంగా లేకపోవడంతో స్టోక్స్ ఆగ్రహించి జడేజాతో వాగ్వాదానికి దిగాడు. ఇంగ్లాండ్ జట్టు మొత్తం సుందర్, జడేజాలపై మాటల దాడి చేశారు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ కూడా గిల్ కూడా ఛేంజ్ రూమ్ నుంచి చూస్తూ అసహ్యించుకున్నాడు. బ్రాడ్కాస్ట్ ఫుటేజీని రీప్లే చేసినప్పుడు, స్టోక్స్ జడేజాతో ఏమి చెప్పాడో స్పష్టమైంది.
"మీరు హ్యారీ బ్రూక్ లా టెస్ట్ సెంచరీ చేయాలనుకుంటున్నారా?" అని స్టోక్స్ అన్నాడు. దీనికి జడేజా సమాధానమిస్తూ.. 'అది నా చేతుల్లో లేదు' అని చెప్పాడు. జాక్ క్రాలీ జోక్యం చేసుకుని 'అయితే షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇది ఇబ్బందికరంగా ఉంది" అని పేర్కొన్నాడు.
మంజ్రేకర్ విమర్శలు
'సెంచరీ చేయాలనుకుంటే నువ్వు కోరుకున్న విధంగా బ్యాటింగ్ చేయాల్సింది' అని స్టోక్స్ జడేజాతో అనడం స్టంప్ మైక్ లో వినిపించింది. ఇంగ్లాండ్ చౌకబారు వ్యూహాలను టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. ఈ స్థితిలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంటే స్టోక్స్ మ్యాచ్ ముగించేందుకు అంగీకరించేవాడా? అని ప్రశ్నించాడు. సుందర్, జడేజా వికెట్లు తీయలేక ఇంగ్లాండ్ టీమ్ ప్రష్టేషన్ కు గురైంది.
‘‘మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. మా బౌలర్లను ఎక్కువ కష్టపెట్టడం ఇష్టం లేదు. అందుకే మ్యాచ్ ముగిద్దామని అడిగా’’ అని మ్యాచ్ అనంతరం స్టోక్స్ వెల్లడించాడు. నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 358, ఇంగ్లాండ్ 669 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 425/4తో నిలిచింది. అయిదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1తో లీడ్ లో ఉంది. చివరి టెస్టు జులై 31న ఓవల్ లో ప్రారంభమవుతుంది.
