Pakistan Cricket Team: మీకు దమ్ముంటే పాకిస్థాన్‌ను నిషేధించండి చూద్దాం.. నిద్ర కూడా పట్టదు: మాజీ క్రికెటర్ వార్నింగ్
12 November 2024, 7:52 IST
- Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఐసీసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీకు దమ్ముంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నుంచి నిషేధించండి.. మీకు నిద్ర కూడా పట్టదంటూ అతడు అనడం గమనార్హం.
మీకు దమ్ముంటే పాకిస్థాన్‌ను నిషేధించండి చూద్దాం.. నిద్ర కూడా పట్టదు: మాజీ క్రికెటర్ వార్నింగ్
Pakistan Cricket Team: పాకిస్థాన్‌కు ఇండియన్ క్రికెట్ టీమ్ వెళ్తుందా లేదా అన్న సందేహాల మధ్య ఆ టీమ్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన కామెంట్స్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే పాకిస్థాన్ పై నిషేధం విధిస్తామన్న వార్తల నేపథ్యంలో దమ్ముంటే ఆ పని చేయండంటూ సవాలు విసిరాడు. ఒకవేళ ఇండియన్ టీమ్ రాకపోతే పాకిస్థాన్ కు రెండు పాయింట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఇండియాకు రెండు పాయింట్లు కోత పెట్టాల్సిందే: బాసిత్
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు తాము ఆ దేశానికి వెళ్లబోమని ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. అయితే అదే జరిగితే ఇండియాకు రెండు పాయింట్లు కోత పెట్టాల్సిందే అని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ డిమాండ్ చేస్తున్నాడు.
"1996 వరల్డ్ కప్ గుర్తుందా? వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీమ్స్ శ్రీలంక వెళ్లి ఆడకపోవడంతో ఆ జట్టుకు నాలుగు పాయింట్లు కేటాయించారు. ఇండియా, పాకిస్థాన్ ను వేర్వేరు గ్రూపుల్లో పెట్టడానికి ప్రయత్నించండి. ఐసీసీ నిరాకరిస్తుంది. పాకిస్థాన్, ఇండియా ఎప్పుడూ ఒకే గ్రూపులో ఉంటాయి. ఎందుకంటే డబ్బు కోసం. ఒకవేళ హైబ్రిడ్ పద్ధతైతే పాకిస్థాన్ కు ఇండియా రాదు. అప్పుడు పాకిస్థాన్ కు రెండు పాయింట్లు ఇవ్వాల్సిందే. గతంలోనూ అది జరిగింది. ఇప్పుడూ అదే చేయండి" అని బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.
దమ్ముంటే పాకిస్థాన్‌ను నిషేధించండి
ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయంలో పాకిస్థాన్ కఠినంగా ఉండాలని, టోర్నీ అక్కడే జరిగేలా పట్టుబట్టాలని స్పష్టం చేశాడు. దమ్ముంటే పాకిస్థాన్ పై నిషేధం విధించి చూడాలని అతడు సవాలు విసిరాడు. "పాకిస్థాన్ తమ అన్ని మ్యాచ్ లను పాకిస్థాన్ లోనే ఆడాలి. అంతే.. ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశానికి తరలిస్తే మాత్రం పాకిస్థాన్ అందులో ఆడకూడదు. వాళ్లు ఆడకపోతే పాకిస్థాన్ ను నిషేధిస్తారని కొందరు అంటున్నారు. మీకు దమ్ముంటే ఆ పని చేయండి. మీకు నిద్ర కూడా పట్టదు" అంటూ బాసిత్ అలీ వార్నింగ్ ఇచ్చాడు.
ఇండియన్ టీమ్ 2008 నుంచి పాకిస్థాన్ లో అడుగుపెట్టలేదు. పాకిస్థాన్ మాత్రం 2012లో చివరిసారి ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత 2016 టీ20 వరల్డ్ కప్, గతేడాది వన్డే వరల్డ్ కప్ కోసం కూడా ఇండియాకు వచ్చింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు ఇండియన్ టీమ్ వెళ్లకపోతే ఏం జరుగుతుందన్నది చూడాలి.