లార్డ్స్ బోర్డులో కేఎల్ రాహుల్ పేరు.. బ్యాటింగ్ లో అదుర్స్.. ఇంగ్లాండ్ పై సూపర్ సెంచరీ.. వెంటనే షాక్.. పాపం పంత్
Published Jul 12, 2025 06:34 PM IST
- టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ హానర్ బోర్డులో మరోసారి తన పేరు ఎక్కేలా చూసుకున్నాడు. ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో ఈ ఇండియన్ బ్యాటర్ సెంచరీ బాదేశాడు. కానీ వెంటనే ఔటైపోయాడు. పంత్ రనౌట్ అయ్యాడు.
రాహుల్ సెంచరీ అభివాదం
భారత క్రికెట్ జట్టు స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. లార్డ్స్ లో సెంచరీతో సత్తాచాటాడు. ఈ ప్రతిష్ఠాత్మక మైదానంలో శతకంతో అక్కడ హానర్ బోర్డులో రెండో సారి పేరు ఎక్కేలా చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీతో టీమిండియా పోరాడుతుంది. కానీ సెంచరీ కాగానే రాహుల్ ఔటవడం, అంతకంటే ముందు పంత్ రనౌట్ తో టీమ్ కష్టాల్లో పడింది.
రాహుల్ అదుర్స్
ఇంగ్లాండ్ తో మూడో టెస్టులో కేఎల్ రాహుల్ సత్తాచాటాడు. లార్డ్స్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో ఓపికతో నిలబడ్డాడు. స్టైలిష్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను అలరించాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. టెస్టు ఫార్మాట్ కు తగ్గట్లుగా ఓపికతో క్రీజులో పాతుకుపోయాడు. 176 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లున్నాయి. లార్డ్స్ లో కేఎల్ కు ఇది రెండో సెంచరీ. ఇంగ్లాండ్ లో ఆరో హండ్రెడ్.
పంత్ తో కలిసి
మూడో రోజు టీమిండియా ఇన్నింగ్స్ ను పంత్ తో కలిసి కేఎల్ రాహుల్ నడిపించాడు. ఓవర్ నైట్ స్కోరు 53 రన్స్ తో రాహుల్, 19 పరుగులతో పంత్ బ్యాటింగ్ కొనసాగించారు. పంత్ కూడా ఓపికతో బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సెంచరీకి చేరువయ్యాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా స్లెడ్జింగ్ చేసినా కేఎల్, పంత్ చెక్కు చెదరలేదు.
కానీ షాక్
అయితే లంచ్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. 99 పరుగులతో ఉన్న కేెఎల్ రాహుల్ కు స్ట్రైక్ ఇచ్చేందుకు లేని పరుగుకు ప్రయత్నించి రిషబ్ పంత్ రనౌటయ్యాడు. పంత్ 112 బంతుల్లో 74 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. పంత్ వికెట్ తో 141 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే లంచ్ తర్వాత సెంచరీ చేరుకున్నాడు రాహుల్ కానీ వెంటనే ఔటయ్యాడు.
నిలబడితేనే
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 67 ఓవర్లకు 5 వికెట్లకు 255 పరుగులతో ఉంది. రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 132 పరుగులు వెనుకబడే ఉంది. టీమిండియాకు ఆధిక్యం దక్కాలంటే జడ్డూ, నితీశ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ లో రాణించాల్సిన అవసరం ఉంది. లేకపోతే టీమ్ కు కష్టాలు తప్పవు.
