KL Rahul: ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చినా కేఎల్ రాహులే వద్దనుకున్నాడట.. అతడిపై నాలుగు జట్ల కన్ను!
30 October 2024, 16:49 IST
- KL Rahul - IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కేఎల్ రాహుల్ బయటికి వచ్చేయనున్నాడని తెలుస్తోంది. రాహులే ఆ ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. అతడిపై నాలుగు ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తితో ఉన్నాయి
KL Rahul: ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చినా కేఎల్ రాహులే లక్నోను వద్దనుకున్నాడట.. అతడిపై నాలుగు ఫ్రాంచైజీల కన్ను!
ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‍ఎస్‍జీ) కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ టీమ్‍ను వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ రిటెన్షన్ గడువు రేపు (అక్టోబర్ 31) సాయంత్రం ముగియనుంది. ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటున్నది 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆలోగా వెల్లడించాలి. అయితే, లక్నో మేనేజ్‍మెంట్ ఉండాలని చెప్పినా.. భారత స్టార్ బ్యాటర్ రాహుల్ బయటికి వచ్చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది.
ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చినా..
కేఎల్ రాహుల్‍ను క్యాప్డ్ వన్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‍మెంట్ భావించిందట. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల తాను ఫ్రాంచైజీ నుంచి వెళ్లిపోతానని కేఎల్ రాహుల్ చెప్పాడని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. “టాప్ రిటెన్షన్ బ్రాకెట్‍ను రాహుల్‍కు ఎల్‍ఎస్‍జీ ఆఫర్ చేసింది. అయితే, వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాల వల్ల జట్టును వీడేందుకే రాహుల్ డిసైడ్ అయ్యాడు” అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది.
ఆ ఘటనతో నొచ్చుకున్న రాహుల్!
ఈ ఏడాది ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ తర్వాత రాహుల్‍పై ఆ జట్టు ఓనర్ సంజయ్ గోయెంక ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోనే అతడితో కోపంగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత స్టార్ ప్లేయర్ రాహుల్ పట్ల గోయెంక వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ ఘటనతో రాహుల్ నొచ్చుకున్నారని, ఫ్రాంచైజీని వీడతారనే పుకార్లు వచ్చాయి.
రాహుల్‍ను ఇంటికి పిలిచి డిన్నర్ ఇచ్చారు గోయెంక. దీంతో అంతా సద్దుమణిగినట్టే కనిపించింది. ఆగస్టులోనూ ఆయనను రాహుల్ కలిశారు. దీంతో అతడిని లక్నో రిటైన్ చేసుకుంటుందనే అంచనాలు వెలువడ్డాయి. అయితే, రాహులే ఇప్పుడు ఆ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టాప్ రిటైన్ ఆప్షన్‍ను అతడు వద్దనుకున్నాడు. లక్నో జట్టుకు మూడు సీజన్లు రాహుల్ కెప్టెన్సీ చేశాడు. రెండుసార్లు ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరింది.
ఆ నాలుగు ఫ్రాంచైజీల ఇంట్రెస్ట్
లక్నోను వీడనుండటంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 మెగావేలంలోకి రానున్నాడు. అతడికి డిమాండ్ భారీ స్థాయిలో ఉండనుంది. కేఎల్ రాహుల్‍పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఒకప్పుడు ఆర్సీబీకి అతడు ఆడాడు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు కూడా రాహుల్‍పై ఆసక్తిగా ఉన్నాయి. వేలంలో అతడి కోసం బిడ్డింగ్ పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.