IND vs AUS: ‘తప్పు నాదే’: బుమ్రాతో గొడవపై స్పందించిన ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్.. కోహ్లీ గురించి గొప్పగా..
08 January 2025, 12:12 IST
- Sam Konstas - IND vs AUS: సిడ్నీ టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాతో జరిగిన వాగ్వాదం గురించి స్పందించాడు సామ్ కొన్‍స్టాస్. ఎందుకు అలా చేశాడో వివరించాడు. తప్పు తనదేనని అంగీచరించాడు. కోహ్లీ గురించి కూడా మాట్లాడాడు.

IND vs AUS: ‘తప్పు నాదే’: బుమ్రాతో గొడవపై స్పందించిన ఆస్ట్రేలియా యంగ్ బ్యాటర్.. కోహ్లీ గురించి గొప్పగా..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కాస్త స్లెడ్జింగ్ నడిచింది. ముఖ్యంగా ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ సామ కొన్‍స్టాస్‍కు భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రాతో వాగ్వాదం జరిగింది. సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో బుమ్రాతో కొన్‍స్టాస్ గొడవకు దిగాడు. ఆ విషయంపై ఇప్పుడు స్పందించాడు కొన్‍స్టాస్.
అందుకే అలా.. తప్పు నాదే
సిడ్నీ టెస్టు తొలి రోజు చివరి 15 నిమిషాలు ఉందనగా ఆస్ట్రేలియా బ్యాటింగ్‍కు దిగింది. బుమ్రా బౌలింగ్ చేస్తుండగా.. కాస్త ఆగాలని ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా చేయి ఎత్తాడు. దీంతో బుమ్రా చిరాకు పడ్డాడు. అయితే, అప్పుడు నాన్‍స్ట్రయికర్ ఎండ్‍లో ఉన్న సామ్ కొన్‍స్టస్ బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు. బుమ్రా కూడా గట్టిగా బదులిచ్చాడు. అంపైర్లు కలగజేసుకున్నారు. ఆ తర్వాత అదే ఓవర్లో ఖవాజాను బుమ్రా ఔట్ చేశాడు. దీంతో కొన్‍స్టాస్‍ను చూస్తూ దూకుడుగా సెలెబ్రేట్ చేసుకున్నాడు బుమ్రా. ఇలా చాలా హీట్‍గా జరిగింది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో కొన్‍స్టాస్ స్పందించాడు.
మరో ఓవర్ ఉండకుండా టైమ్ వేస్ట్ చేసేందుకు తాను బుమ్రాతో వాదనకు దిగానని కొన్‍స్టాస్ తన పొరపాటు అంగీకరించాడు. “భారత్ మరో ఓవర్ వేయకుండా ఉండేందుకు నేను టైమ్ వేస్ట్ చేయాలని అనుకున్నా. కానీ బుమ్రాకు వికెట్ దక్కింది. అతడో వరల్డ్ క్లాస్ బౌలర్” అని కొన్‍స్టస్ చెప్పాడు. “యుజి (ఉస్మాన్ ఖవాజా) కాస్త సమయం ఆపాలని అనుకున్నాడు. కానీ నేను మధ్యలో కల్పించుకున్నా. ఇది నా తప్పే. ఆ సందర్భాన్ని కూడా బుమ్రా ఉపయోగించుకున్నాడు. క్రికెట్ అంటే ఇంతే. ఎలాంటివి జరుగుతుంటాయి. మొత్తంగా మా టీమ్ బాగా పర్ఫార్మ్ చేసింది” అని కొన్‍స్టాస్ చెప్పాడు.
కోహ్లీ అంటే ఇష్టం
ఈ సిరీస్ నాలుగో టెస్టులో కోహ్లీ, కొన్‍స్టాస్ మధ్య కూడా గొడవ జరిగింది. అయితే, ఆ తర్వాత కోహ్లీని అతడు కలిసి మాట్లాడాడు. కోహ్లీ గురించి కూడా కొన్‍స్టాస్ తాజాగా స్పందించాడు. “విరాట్ కోహ్లీని నేను ఆరాధిస్తా. మా కుటుంబం మొత్తం అతడిని ఇష్టపడుతుంది. కోహ్లీ చాలా మంచి వ్యక్తి. ఒదిగి ఉండే వ్యక్తితత్వం. నేను ఆరాధిస్తున్నాని కోహ్లీతోనూ చెప్పా. శ్రీలంక పర్యటనలోనూ బాగా ఆడాలని నాతో చెప్పాడు” అని కొన్‍స్టాస్ వెల్లడించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో టీమిండియా ఓడిపోయింది. పదేళ్ల తర్వాత బీజీటీ సిరీస్ టైటిల్ గెలిచింది ఆస్ట్రేలియా. ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ తొలి మ్యాచ్ గెలిచినా.. ఆ తర్వాత తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‍లో 32 వికెట్లు తీసుకొని అద్భుత ప్రదర్శన చేశాడు.