తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం ఎప్పుడో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు.. జై షా స్థానంలో కొత్త సెక్రటరీ ఎంపిక

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం ఎప్పుడో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు.. జై షా స్థానంలో కొత్త సెక్రటరీ ఎంపిక

12 January 2025, 18:45 IST

google News
    • IPL 2025: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎప్పుడు మొదలుకానుందో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. సర్వసభ్య సమావేశంలో ఈ తేదీలను బీసీసీఐ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలాగే, బోర్డుకు కొత్త సెక్రటరీ, ట్రెజరర్‌ ఎంపికయ్యారు.
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం ఎప్పుడో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు.. జై షా స్థానంలో కొత్త సెక్రటరీ ఎంపిక
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం ఎప్పుడో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు.. జై షా స్థానంలో కొత్త సెక్రటరీ ఎంపిక

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం ఎప్పుడో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు.. జై షా స్థానంలో కొత్త సెక్రటరీ ఎంపిక

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‍ ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అప్‍డేట్ కోసం వేచిచూస్తున్నారు. ఆ తేదీని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశం నేడు (జనవరి 12) ముంబైలో జరిగింది. ఈ సమావేశం తర్వాత రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ తేదీ గురించి చెప్పారు.

డేట్ ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్ ఈ ఏడాది మార్చి 23వ తేదీన మొదలవుతుందని రాజీవ్ శుక్లా వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు. ఫైనల్ మే 25వ తేదీన ఉంటుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. షెడ్యూల్‍పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జై స్థానంలో దేవజిత్ సైకియా

బీసీసీఐ నూతన కార్యదర్శిగా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ దేవ్‍జిత్ సైకియా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రాజీవ్ శుక్లా వెల్లడించారు. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా.. గతేడాది ఐసీసీ చైర్మన్‍గా నియమితులయ్యారు. దీంతో ఆ స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా దేవ్‍జిత్ ఎంపికయ్యారు. ఆ స్థానానికి ఆయన ఒక్కరి నుంచి నామినేషన్ వచ్చిందని, ఏకగ్రీవంగా ఎంపికైనట్ట రాజీవ్ తెలిపారు. బీసీసీఐ ట్రెజరర్‌గా ప్రభ్‍జీత్ సింగ్ భాటియా ఎన్నికైనట్టు తెలిపారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపికపై..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత జట్టును ఎప్పుడు ప్రకటించనున్నారో రాజీవ్ శుక్లా తెలిపారు. టీమ్ ఎంపిక కోసం జనవరి 18, 19 తేదీల్లో మీటింగ్ జరుగుతుందని అన్నారు. అంటే జనవరి 19న జట్టుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం చెందడంపై కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో బీసీసీఐ అధికారులు రివ్యూ మీటింగ్ చేశారు. జట్టు పరిస్థితి, చేయాల్సిన మార్పుల గురించి ముచ్చటించారు. టెస్టు కెప్టెన్‍గా ఇక కొన్ని నెలలే తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినట్టుగా రిపోర్టులు వచ్చాయి. ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍కు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. అయితే, ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍కు, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది.

కాగా, ఐపీఎల్ 2025 సీజన్ కోసం గతేడాది నవంబర్‌లో జెడా వేదికగా మెగా వేలం జరిగింది. 182 మంది ప్లేయర్లను రూ.639.15 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేశాయి 10 ఫ్రాంచైజీలు. రూ.27కోట్లను దక్కించుకొని ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా వేలంతో చాలా ఫ్రాంచైజీల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో ఐపీఎల్ 2025 సీజన్‍పై మరింత ఎక్కువ ఆసక్తి నెలకొంది.

తదుపరి వ్యాసం