తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Kkr Vs Rcb: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ రద్దు తప్పదా? కేకేఆర్, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

IPL 2025 KKR vs RCB: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ రద్దు తప్పదా? కేకేఆర్, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

Hari Prasad S HT Telugu

Published Mar 20, 2025 09:48 PM IST

google News
    • IPL 2025 KKR vs RCB: ఐపీఎల్ 2025లో తొలి మ్యాచే రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ జరిగే కోల్‌కతాకు అదే రోజు ఆరెంజ్ అలెర్ట్ జారీ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ రద్దు తప్పదా? కేకేఆర్, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ (AFP)

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ రద్దు తప్పదా? కేకేఆర్, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

IPL 2025 KKR vs RCB: ఐపీఎల్ 18వ ఎడిషన్ శనివారం (మార్చి 22) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉండటంతో అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ డౌటే

కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ శనివారం (మార్చి 22) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. అయితే నగరానికి భారీ వర్ష సూచనలు వస్తుండటంతో ఈ మ్యాచ్ రద్దవడం ఖాయమన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ కూడా జరగాల్సి ఉంది. అందులో శ్రేయా ఘోషాల్, దిశా పటానీలాంటి వాళ్లు పర్ఫామ్ చేయబోతున్నారు.

అయితే ఇదంతా ఆ రోజు వర్షం కురవకపోతేనే సాధ్యమవుతుంది. భారత వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం మేరకు శనివారం (మార్చి 22) వరకు కోల్‌కతాలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. అటు ప్రాంతీయ వాతావరణ శాఖ కూడా మార్చి 20 నుంచి 22 వరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

అభిమానుల్లో ఆందోళన

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ కే ఇలా వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ను తొలి మ్యాచ్ లోనే సొంతగడ్డపై ఆడుతుంటే చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కేకేఆర్ జట్టుకు ఈసారి అజింక్య రహానే కెప్టెన్ గా ఉండనున్నాడు. అటు ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. కేకేఆర్ గతేడాది ఛాంపియన్ గా నిలవగా.. ఆర్సీబీ నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఎలిమినేటర్ లో ఓడిపోయింది. ఇక తొలి మ్యాచ్ జరగాల్సిన ఈడెన్ గార్డెన్స్ లో ఆర్సీబీపై కేకేఆర్ కు స్పష్టమైన ఆధిక్యం ఉంది.

ఇక్కడ ఈ రెండు టీమ్స్ 12 మ్యాచ్ లలో తలపడగా.. 8 మ్యాచ్ లలో కేకేఆర్ గెలిచింది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ సమయానికి వర్షం ఆగిపోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.