హీరో శుభ్‌మన్ గిల్.. కష్టాల్లో సూపర్ సెంచరీ.. బ్రాడ్‌మన సరసన చేరి రికార్డు
Published Jul 27, 2025 05:39 PM IST
- ఇండియన్ క్రికెట్ టీమ్ టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్ తో సెన్సేషనల్ హండ్రెడ్ కొట్టాడు. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టులో టీమిండియాను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు అసాధారణంగా పోరాడాడు. హండ్రెడ్ తో రికార్డు నెలకొల్పాడు.
శుభ్‌మన్ గిల్
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కరెక్ట్ టైమ్ లో సెంచరీతో టీమ్ ను ఆదుకున్నాడు. మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు అయిదో రోజు (జులై 27) ఆటలో సూపర్ సెంచరీతో శుభ్‌మన్ గిల్ టీమ్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు అసాధారణంగా పోరాడాడు. ఈ సెంచరీతో రికార్డు కూడా అందుకున్నాడు.
ఒత్తిడిలో నిలబడి
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు చివరి రోజు శుభ్‌మన్ గిల్ సత్తాచాటాడు. నాలుగో రోజు పరుగులేకుండా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించేందుకు పోరాడాడు. 0/2తో బ్యాటింగ్ కు దిగిన గిల్ బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా ఒత్తిడిలో ఉన్నప్పుడు అద్భుత సెంచరీ సాధించి భారత్ భారీ లోటును పూడ్చి మ్యాచ్ ను చివరి రోజుకు నెట్టాడు. సెంచరీతో అదరగొట్టాడు. 238 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 12 ఫోర్లు కొట్టాడు.
కేఎల్ తో కలిసి
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి గిల్ 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయిదో రోజు కేఎల్ రాహుల్ (90)తో కలిసి మూడో వికెట్ కు 421 బంతుల్లో 188 పరుగులు జోడించాడు. ఇండియాకు ఇన్నింగ్స్ ఓటమి అందించాలనే ఇంగ్లాండ్ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. ఎంతో ఓపికతో, జట్టు భారాన్ని భుజాలవేసుకుని అద్భుతమైన బ్యాటింగ్ డిస్ ప్లేను ప్రదర్శించాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ దాడిని సమర్థంగా కాచుకున్నాడు. సెంచరీ తర్వాత ఔటైపోయాడు.
రికార్డు
ఇది గిల్ కు తొమ్మిదవ టెస్ట్ సెంచరీ ఈ సిరీస్ లో నాలుగో శతకం. ఒకే టెస్ట్ సిరీస్ లో నాలుగు సెంచరీలు సాధించిన డాన్ బ్రాడ్ మన్, మహ్మద్ యూసుఫ్, జాక్వెస్ కలిస్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ సరసన గిల్ చేరాడు. లార్డ్స్ లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడం, మాంచెస్టర్ లో తొలి ఇన్నింగ్స్ లో అతని బౌలింగ్ రొటేషన్ ఎంపిక విమర్శలను ఎదుర్కొన్న తర్వాత గిల్ నాయకత్వం విమర్శల పాలైంది. అతని వ్యూహాలు, నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ మాంచెస్టర్ లో సెంచరీతో సమాధానమిచ్చాడు. నాలుగు రోజుల ముగింపు దిశగా సాగుతున్నట్లు అనిపించిన మ్యాచ్లో డ్రాపై ఆశలు కల్పించాడు.
ఈ సిరీస్ లో 700 పరుగుల మార్కును కూడా అధిగమించి టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (2024లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ పై) సాధించిన 712 పరుగుల రికార్డును అధిగమించాడు గిల్. 774 పరుగులతో టాప్ ప్లేసులో నిలిచిన సునీల్ గవాస్కర్ తర్వాతి స్థానాన్ని గిల్ దక్కించుకున్నాడు.
