తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆకాశ్ దీప్.. నైట్ వాచ్‌మ‌న్‌గా రికార్డు.. ఫ‌స్ట్ టెస్టు ఫిఫ్టీ.. కెప్టెన్ రియాక్షన్

ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆకాశ్ దీప్.. నైట్ వాచ్‌మ‌న్‌గా రికార్డు.. ఫ‌స్ట్ టెస్టు ఫిఫ్టీ.. కెప్టెన్ రియాక్షన్

Published Aug 02, 2025 06:03 PM IST

google News
  • టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ బ్యాటింగ్ తోనూ సత్తాచాటాడు. ఓవల్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న అయిదో టెస్టులో నైట్ వాచ్‌మ‌న్‌గా రికార్డు నెలకొల్పాడు. కెరీర్ లో తొలి టెస్టు ఫిఫ్టీ అందుకున్నాడు. అతను హాఫ్ సెంచరీ చేరుకున్నాక కెప్టెన్, కోచ్ రియాక్షన్ వైరల్ గా మారాయి. 
ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ.. గిల్, గంభీర్ రియాక్షన్ (Screengrabs - JioHotstar)

ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ.. గిల్, గంభీర్ రియాక్షన్

ఇంగ్లాండ్‌తో ఓవల్ లో జరుగుతున్న అయిదో టెస్ట్ లో టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ అదరగొట్టాడు. బ్యాటింగ్ లో సత్తాచాటాడు. రెండో రోజు (ఆగస్టు 1) చివరి కొన్ని నిమిషాల్లో నైట్ వాచ్‌మన్‌గా క్రీజులోకి పంపించిన అతను.. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడో రోజు (ఆగస్టు 2) ఉదయం సెషన్‌లో తన తొలి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ కుడిచేతి బ్యాటర్ తన సహజ శైలిలో ఆడుతూ బంతులను బలంగా బాదాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఆకాష్ దీప్ మూడో వికెట్‌కు నిలకడగా భాగస్వామ్యం నెలకొల్పాడు.


కోచ్, కెప్టెన్ రియాక్షన్స్

38వ ఓవర్‌లో గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆకాశ్ దీప్. మైలురాయిని చేరుకున్న వెంటనే ఆకాష్ దీప్ తన పిడికిలి బిగించి భారత జట్టు వైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత తన బ్యాట్‌ను పైకెత్తాడు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నవారంతా 28 ఏళ్ల ఆకాష్ దీప్‌ను చూసి సంతోషించారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెల్మెట్ పెట్టుకుని బాల్కనీలోకి వచ్చి తన సహచరుడిని అభినందించాడు.

రవీంద్ర జడేజా ఆకాష్ దీప్‌ను హెల్మెట్ తీసి స్టైల్‌గా సెలబ్రేట్ చేసుకోమని సూచించాడు. అయితే బ్యాటర్ మాత్రం ఓవల్ ప్రేక్షకుల నుంచి వస్తున్న చప్పట్లను ఆస్వాదిస్తూ సంబరాల్లో మునిగిపోయాడు. ఈ మైలురాయికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చిరునవ్వు చిందించాడు.

ఆ రికార్డు

ఇంగ్లాండ్ తో అయిదు టెస్టులో నైట్ వాచ్‌మ‌న్‌గా వచ్చి 66 పరుగులు చేసిన ఆకాశ్ దీప్ ఓ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో నైట్ వాచ్‌మ‌న్‌గా నిలిచాడు. అమిత్ మిశ్రా (84 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. 2011లో ఇదే వేదికపై ఇంగ్లాండ్‌పై అమిత్ మిశ్రా ఈ పరుగులు చేయడం విశేషం. మిశ్రా తర్వాత ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత నైట్ వాచ్‌మన్ ఆకాష్ దీప్. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ తన అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరును నమోదు చేశాడు.

ఆకాష్ దీప్ చివరికి 43వ ఓవర్‌లో గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో 66 పరుగులకు ఔటయ్యాడు. అతని 94 బంతుల ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు ఉన్నాయి. భారత నైట్ వాచ్‌మన్ బ్యాటింగ్ ప్రయత్నాన్ని ఓవల్ ప్రేక్షకులంతా నిలబడి అభినందించారు. ఈ వికెట్ ఫలితంగా మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆటలో లంచ్ సమయానికి ఇండియా 189/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 224, ఇంగ్లాండ్ 247 పరుగులు చేశాయి.