IND vs SA 3rd T20 Live: మూడో టీ20లోనూ భారత కెప్టెన్‌ని వెంటాడిన బ్యాడ్‌లక్, మళ్లీ దక్షిణాఫ్రికాని వరించిన టాస్
13 November 2024, 20:21 IST
India vs South Africa: దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటికే వరుసగా రెండు టీ20లు ఆడిన భారత్ జట్టు.. ఒకదాంట్లో గెలిచి.. మరో దాంట్లో ఓడిపోయింది. దాంతో నాలుగు టీ20ల సిరీస్ 1-1తో ఆసక్తిగా కొనసాగుతోంది.
భారత టీ20 జట్టు
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా బుధవారం రాత్రి జరుగుతున్న మూడో టీ20లోనూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. దాంతో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆడెన్ మారక్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.
భారత్ తుది జట్టులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించి.. అతని స్థానంలో రమణదీప్ సింగ్‌ను తీసుకున్నాడు.
మూడో టీ20కి భారత్ జట్టు
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా తుది జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేవు
ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికిల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లూథో సిపమ్లా
గెలిచి.. ఓడి.. సిరీస్ సమం
డర్బన్ వేదికగా గత శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 202 పరుగులు చేసిన టీమిండియా.. 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 124 పరుగులే చేయడంతో.. 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తప్పలేదు.
నాలుగు టీ20ల ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమవగా.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యాన్ని సాధించుకోవాలని రెండు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే భారత్ జట్టులో ఓపెనర్ సంజు శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. బౌలర్లు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తున్నారు. మిగిలిన వాళ్లు జోరందుకోవాలని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.