తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 1st Test: భారత్ జట్టులోకి పెర్త్ టెస్టు కోసం ఇద్దరు కొత్త బ్యాటర్లకి సడన్‌గా పిలుపు, టీమ్‌లో ఏం జరుగుతోంది?

IND vs AUS 1st Test: భారత్ జట్టులోకి పెర్త్ టెస్టు కోసం ఇద్దరు కొత్త బ్యాటర్లకి సడన్‌గా పిలుపు, టీమ్‌లో ఏం జరుగుతోంది?

Galeti Rajendra HT Telugu

17 November 2024, 16:32 IST

google News
  • India Test Squad vs AUS 2024: ఆస్ట్రేలియా పర్యటనకి బీసీసీఐ 18 మందితో కూడిన జట్టుని ఇప్పటికే ప్రకటించింది. ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. బ్యాటర్ల కొరత ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే?

సాయి సుదర్శన్
సాయి సుదర్శన్

సాయి సుదర్శన్

ఆస్ట్రేలియా గడ్డపై నవంబరు 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడనుంది. అయితే.. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టు ముంగిట భారత్ జట్టులో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. దాంతో టీమ్‌లోకి కొత్తగా ఇద్దరు బ్యాటర్లను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వార్మప్ మ్యాచ్‌, ప్రాక్టీస్ సెషన్‌లో వరుసగా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, శుభమన్ గిల్ గాయపడ్డారు, రాహుల్, కోహ్లీ, సర్ఫరాజ్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డారు. శుభమన్ గిల్ మాత్రం ఫీల్డింగ్ చేస్తుండగా బంతిని అడ్డుకునే క్రమంలో గాయడపడ్డాడు. అతని చేతి బొటన వేలు విరిగినట్లు సమాచారం.

ఒకవైపు భారత్ జట్టులో గాయాలబెడద.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో తొలి టెస్టుకి దూరంగా ఉంటూ భారత్‌లోనే ఉండిపోయాడు. దాంతో ఇప్పుడు భారత్ జట్టు టాప్ ఆర్డర్‌లో గజిబిజి గందరగోళం నెలకొంది.

3 రిజర్వ్ ఆటగాళ్లు ఉన్నా.. బ్యాటర్ల కొరత

వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ కోసం బీసీసీఐ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులోనే ముగ్గురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా అనౌన్స్ చేసింది. అయితే.. ఆ ముగ్గురూ బౌలర్లే కావడంతో.. టీమ్‌లో బ్యాటర్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్న భారత యంగ్ బ్యాటర్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌ను వెంటనే టీమ్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా- ఎ జట్టుతో సిరీస్ ఆడేందుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని భారత-ఎ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఇద్దరు ఆటగాళ్లను తుది జట్టులో ఆడించాలా? వద్దా? అనే తుది నిర్ణయం కోచ్, కెప్టెన్, సెలక్టర్లు తీసుకోవాల్సి ఉంది.

ఆప్షన్ ఉన్నా.. ఫామ్ ప్లేయర్ల కోసం

కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా ఆడటానికి కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటికే జట్టులో ఉన్నారు. అయితే.. రాహుల్ గాయపడగా.. ఈశ్వరన్ ప్రదర్శనపై టీమిండియా మేనేజ్‌మెంట్‌కి నమ్మకం కుదరనట్లు కనిపిస్తోంది. దాంతో సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్‌లో ఒకరిని ఆడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల సాయి సుదర్శన్ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ 88 పరుగులతో సత్తాచాటాడు. దానికితోడు ఇద్దరూ లెప్ట్ హ్యాండ్ బ్యాటర్లు కావడంతో లెప్ట్-రైట్ కాంబినేషన్‌కి ఉపయోగపడతారని భావిస్తున్నట్లుంది. ఈ మేరకు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ మినహా ఇండియా-ఎ టీమ్‌లోని ఆటగాళ్లందరూ ఆదివారం భారత్‌కి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ మాత్రం భారత్ టెస్టు జట్టుతోనే ఉండనున్నారు.

తదుపరి వ్యాసం