IND vs SA 2nd T20: చేతులెత్తేసిన టీమిండియా టాప్‌ఆర్డర్.. దక్షిణాఫ్రికా ముందు చిన్న టార్గెట్
10 November 2024, 21:46 IST
India vs South Africa 2nd T20: తొలి టీ20లో సెంచరీ బాదిన సంజు శాంసన్.. ఈరోజు మ్యాచ్‌లో డకౌట్ అవ్వడంతో భారత్ జట్టు చాలా తక్కువ స్కోరుకే పరిమితమైపోయింది.
ఫస్ట్ ఓవర్‌లో ఔటై పెవిలియన్‌కి వెళ్తున్న సంజు శాంసన్
దక్షిణాఫ్రికాతో గెబేహా వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న రెండో టీ20లో భారత్ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.దాంతో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది.
టీమ్‌లో హార్దిక్ పాండ్య 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గత శుక్రవారం ఇదే దక్షిణాఫ్రికాతో డర్బన్ జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు 202 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
సంజు డకౌట్‌తో మొదలు
తొలి టీ20లో సెంచరీ బాదిన సంజు శాంసన్‌ను ఫస్ట్ ఓవర్‌లోనే ఈరోజు ఔట్ చేసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్.. టీమిండియాని ఒత్తిడిలోకి నెట్టేశాడు.
సంజు శాంసన్ డకౌటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4), మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (4) కూడా తక్కువ స్కోరుకే వరుసగా పెవిలియన్‌కి చేరిపోయారు. దాంతో భారత్ జట్టు 15/3తో ఆత్మరక్షణలో పడిపోయింది.
ఈ దశలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) కాసేపు నిలకడగా ఆడినా.. టీమ్‌కి మెరుగైన స్కోరుని అందించలేకపోయారు. భారీ షాట్ ఆడే క్రమంలో తిలక్ వర్మ, బ్యాడ్ లక్‌తో అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగారు. ఇక డెత్ ఓవర్లలో చెలరేగుతాడని ఆశించిన రింకు సింగ్ (9).. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో భారీ షాట్ కోసం వెళ్లి బోల్తాకొట్టాడు.
పరువు నిలిపిన హార్దిక్
ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా సహనంతో క్రీజులో నిలిచాడు. 45 బంతులాడిన హార్దిక్ 4 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 39 పరుగులు చేసి ఆఖరి వరకూ అజేయంగా క్రీజులో నిలిచాడు. చివర్లో అర్షదీప్ సింగ్ (6) ఒక సిక్స్ కొట్టడంతో భారత్ జట్టు కనీసం 120 పరుగుల మార్క్‌నైనా అందుకోగలిగింది.
తొలి టీ20లో తేలిపోయిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. రెండో టీ20లో సమష్టిగా రాణించారు. మార్కో జాన్సెన్, గెరాల్డ్, సిమెలాన్, మార్‌క్రమ్,పీటర్ తలో వికెట్ పడగొట్టారు.
తొలి టీ20తో పోలిస్తే
తొలి టీ20లో భారత్ జట్టు 61 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 203 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ 141 పరుగులకే తొలి టీ20లో ఆలౌటవగా.. రెండో టీ20లో ఆ జట్టు ముందు కేవలం 125 పరుగులే భారత్ టార్గెట్‌గా ఉంచింది.