తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Washington Sundar: మూడేళ్ల తర్వాత పిలుపు, బ్యాక్ టు బ్యాక్ వికెట్లతో కెప్టెన్ రోహిత్ శర్మకి రిటర్న్ గిఫ్ట్

Washington Sundar: మూడేళ్ల తర్వాత పిలుపు, బ్యాక్ టు బ్యాక్ వికెట్లతో కెప్టెన్ రోహిత్ శర్మకి రిటర్న్ గిఫ్ట్

Galeti Rajendra HT Telugu

24 October 2024, 15:02 IST

google News
  • IND vs NZ 2nd Test Live: స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ విసిరిన డెలివరీకి న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్ వద్ద సమాధానమే లేకపోయింది. ఇద్దరూ ఒకే తరహాలో క్లీన్ బౌల్డ్ అయ్యారు. 

రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్
రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ (AP)

రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్

న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు స్పిన్నర్లు వరుసగా వికెట్లు తీస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ టీమ్.. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ దెబ్బకి 65 ఓవర్లలో 210/6తో నిలిచింది. క్రీజులో మిచెల్ శాంట్నర్ (5 బ్యాటింగ్: 6 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (2 బ్యాటింగ్: 7 బంతుల్లో) ఉన్నారు.

టాప్-3 వికెట్లు అశ్విన్ ఖాతాలో

ఇటీవల ముగిసిన బెంగళూరు టెస్టులో పిచ్ ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించగా.. పుణె టెస్టు నుంచి స్పిన్నర్లకి సహకారం లభిస్తోంది. దాంతో న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్ (15), దేవాన్ కాన్వె (76)తో పాటు విల్ యంగ్ (18) వికెట్లని అశ్విన్ పడగొట్టి భారత్‌కి మెరుగైన ఆరంభాన్ని ఇచ్చాడు.

పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడటంతో.. అశ్విన్‌కి జోడీగా వాషింగ్టన్ సుందర్‌ని బరిలోకి దిగించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫలితం రాబట్టాడు.

మూడేళ్ల తర్వాత పిలుపు

2021 తర్వాత గాయం, ఫిట్‌నెస్ సమస్యలతో టెస్టులకి దూరంగా ఉండిపోయిన వాషింగ్టన్ సుందర్.. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించాడు. దాంతో బెంగళూరు టెస్టులో భారత్ జట్టు ఓడిపోగానే సడన్‌గా వాషింగ్టన్ సుందర్‌కి భారత్ జట్టు నుంచి పిలుపు వెళ్లింది.

గంటల వ్యవధిలోనే భారత్ జట్టుతో చేరిన వాషింగ్టన్ సుందర్ ఎవరూ ఊహించని విధంగా పుణె టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకి తప్పించి మరీ ఎంతో నమ్మకంతో వాషింగ్టన్ సుందర్‌కి తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చోటిచ్చాడు.

ఇద్దరూ క్లీన్ బౌల్డ్

కెప్టెన్ రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో రచిన్ రవీంద్ర (65), టామ్ బ్లండెల్ (3) వికెట్లని పడగొట్టిన వాషింగ్టన్ సుందర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ఇద్దరు బ్యాటర్ల వద్ద వాషింగ్టన్ సుందర్ విసిరిన బంతికి సమాధానమే లేకపోయింది.

కనీసం బంతిని టచ్ కూడా ఇద్దరూ చేయలేకపోగా.. రెండు బంతులూ బ్యాట్ పక్క నుంచి వెళ్లి వికెట్లని గీరాటేశాయి. ఆ తర్వాత కాసేపటికే డార్లీ మిచెల్ (18)ను కూడా ఎల్బీడబ్ల్యూగా వాషింగ్టన్ సుందర్ ఔట్ చేసేశాడు.

లాస్ట్ ఎప్పుడు ఆడాడంటే?

వాషింగ్టన్ సుందర్ చివరిగా 2021, మార్చిలో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు కేవలం 5 టెస్టులే ఆడిన సుందర్ 337 పరుగులతో పాటు 9 వికెట్లు కూడా పడగొట్టాడు.

తదుపరి వ్యాసం