తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul Injury: ఆస్ట్రేలియా గడ్డపై కేఎల్ రాహుల్ గాయపడ్డాడిలా.. వీడియో వదిలిన బీసీసీఐ, ఫ్రాక్చర్‌పై కూడా క్లారిటీ

KL Rahul Injury: ఆస్ట్రేలియా గడ్డపై కేఎల్ రాహుల్ గాయపడ్డాడిలా.. వీడియో వదిలిన బీసీసీఐ, ఫ్రాక్చర్‌పై కూడా క్లారిటీ

Galeti Rajendra HT Telugu

17 November 2024, 17:30 IST

google News
  • IND vs AUS 2024: పెర్త్ టెస్టు ముంగిట కేఎల్ రాహుల్ గాయపడటం టీమిండియా మరింత టెన్షన్‌లో పెట్టేసింది. ఇప్పటికే శుభమన్ గిల్ బొటనవేలికి గాయమవగా.. రోహిత్ శర్మ భారత్‌లోనే ఉండిపోయాడు. దాంతో రాహుల్‌ని తప్పక ఆడించాల్సిన పరిస్థితి. అయితే? 

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ మొదటి రోజు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి అతని మోచేయికి బలంగా తాకింది. దాంతో గాయం తర్వాత మైదానం వీడిన రాహుల్ రెండో రోజు కూడా మైదానంలోకి రాలేదు.

పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ గాయంపై అప్‌డేట్ కోసం టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకి రాహుల్ గాయంపై క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.

గాయం అవగానే స్కానింగ్‌కి

కేఎల్ రాహుల్ గాయపడిన వెంటనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కానింగ్ కోసం తీసుకెళ్లామని.. స్కానింగ్‌లో అతనికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని వైద్యులు తేల్చినట్లు టీమిండియా ఫిజియోథెరపిస్ట్ ఆ వీడియోలో క్లారిటీ ఇచ్చారు.

ఫ్రాక్చర్ కానప్పటికీ.. రాహుల్‌కి గాయం నొప్పి సమస్య అలానే రెండు రోజులు ఉందని.. ఇప్పుడు అతను ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు క్లారిటీ ఇచ్చారు. కేఎల్ రాహుల్ కూడా తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని.. మళ్లీ మైదానంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.

రోహిత్, గిల్ ఔట్..

పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాస్తవానికి కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో అతనికి తుది జట్టులో చోటు కష్టమే. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ భారత్‌లోనే ఉండిపోవడం, నెం.4లో ఆడే శుభమన్ గిల్ గాయపడటంతో రాహుల్‌కి తుది జట్టులో చోటు ఖాయమైంది. గిల్ ఫీల్డింగ్ చేస్తుండగా.. అతని బొటన వేలికి తీవ్రగాయమైన విషయం తెలిసిందే.

పేలవ ఫామ్ కారణంగా.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్‌పై చివరి రెండు టెస్టుల్లోనూ వేటు పడింది. అయితే.. రోహిత్, గిల్ జట్టుకి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు రాహుల్‌ని టాప్ ఆర్డర్‌లో తప్పక ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దొరికిన ఈ అవకాశాన్ని రాహుల్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

తదుపరి వ్యాసం