తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test: గ‌బ్బా టెస్ట్‌కు వ‌రుణుడి దెబ్బ - నిలిచిన ఆట - సిరాజ్‌పై ఆస్ట్రేలియా ఫ్యాన్స్ వ‌ల్గ‌ర్ కామెంట్స్‌

IND vs AUS 3rd Test: గ‌బ్బా టెస్ట్‌కు వ‌రుణుడి దెబ్బ - నిలిచిన ఆట - సిరాజ్‌పై ఆస్ట్రేలియా ఫ్యాన్స్ వ‌ల్గ‌ర్ కామెంట్స్‌

14 December 2024, 11:03 IST

google News
  • IND vs AUS 3rd Test:గ‌బ్బా టెస్ట్‌కు తొలిరోజే వ‌రుణుడు అడ్డంకి సృష్టించాడు. వ‌ర్షం కార‌ణంగా తొలి సెష‌న్ ఆట చాలా వ‌ర‌కు నిలిచిపోయింది. లంచ్ టైమ్‌కు ఆస్ట్రేలియా వికెట్ న‌ష్ట‌పోకుండా 28 ప‌రుగులు చేసింది. గ‌బ్బా టెస్ట్‌లో టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్ప‌గించాడు.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్

IND vs AUS 3rd Test: గ‌బ్బా టెస్ట్‌కు తొలిరోజే వ‌రుణుడి అడ్డంకి ఎదురైంది. వ‌ర్షం కార‌ణంగా తొలి సెష‌న్‌లో 13 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆట సాధ్య‌మైంది. దాదాపు గంట‌న్న‌ర‌కుపైగా ఆట తుడిచిపెట్టుకుపోయింది. వ‌ర్షం తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ప్ర‌క‌టించారు. లంచ్ త‌ర్వాత కూడా ఆట కొన‌సాగుతుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

28 ప‌రుగులు...

గ‌బ్బా టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ...ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్ప‌గించాడు. మ్యాచ్ మొద‌లైన కొద్ది సేప‌టికే వ‌ర్షం ప‌డ‌టంతో అర‌గంట‌పైనే ఆట‌ నిలిచిపోయింది. ఆ త‌ర్వాత వ‌ర్షం త‌గ్గ‌డంతో తిరిగి మ్యాచ్‌ను మొద‌లుపెట్టారు.

మ‌ళ్లీ వ‌రుణుడు ప్ర‌తాపం చూపించ‌డంతో ఆట‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి ఆస్ట్రేలియా ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 13.2 ఓవ‌ర్ల‌లో 28 ప‌రుగులు చేసింది. ఉస్మాన్ ఖ‌వాజా 19 ప‌రుగులు, మెక్ స్వీనీ 4 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

రెండు మార్పులు...

గ‌బ్బా టెస్ట్‌లో టీమిండియా తుది జ‌ట్టులో రెండు మార్పులు చేసింది. అశ్విన్ బ‌దులు జ‌డేజా...హ‌ర్షిత్ రాణా స్థానంలో ఆకాష్ దీప్ జ‌ట్టులోకి వ‌చ్చారు.

సిరాజ్‌పై వ‌ల్గ‌ర్ కామెంట్స్‌...

గ‌బ్బా టెస్ట్‌లో సిరాజ్ బౌలింగ్‌కు దిగిన‌ టైమ్‌లో అత‌డిని ఆస్ట్రేలియా అభిమానులు టార్గెట్ చేశారు. సిరాజ్‌పై వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కామెంట్స్‌ను ఇండియా క్రికెట్ అభిమానులు త‌ప్పుప‌డుతోన్నారు. ఆట‌లో కొన్నిసార్లు ఆవేశానికి లోన‌వ్వ‌డం స‌హ‌జ‌మ‌ని. అంత మాత్రానికే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం స‌రికాదంటూ చెబుతోన్నారు.

సిరాజ్ వ‌ర్సెస్ హెడ్‌...

పింక్ బాల్ టెస్ట్‌లో ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ ప‌లుమార్లు మాట‌ల యుద్ధానికి దిగారు. ఈ టెస్ట్‌లో సెంచ‌రీ చేసిన ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. అత‌డిని పెవిలియ‌న్ వెళ్లిపొమ్మ‌న్న‌ట్లుగా చేతుల‌తో సైగ‌లు చేస్తూ సంబ‌రాలు చేసుకున్నాడు సిరాజ్‌. అత‌డిపై ట్రావిస్ హెడ్ నోరుపారేసుకున్నాడు. ఈ ఇద్ద‌రి గొడ‌వను మ్యాచ్ రిఫ‌రీ సీరియ‌స్‌గా తీసుకున్నాడు.

సిరాజ్ మ్యాచ్ ఫీజులో ఇర‌వై శాతం కోత విధించారు. అంతే కాకుండా అత‌డికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. ట్రావిస్ హెడ్‌కు మాత్రం ఎలాంటి ప‌నిష్‌మెంట్ విధించ‌కుండా వ‌దిలేశారు. ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ గొడ‌వ‌ను ఉద్దేశించే గ‌బ్బా టెస్ట్‌లో టీమిండియా పేస‌ర్‌ను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు.

తదుపరి వ్యాసం