తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sa 1st T20 Highlights: క్యాచ్ వదిలేసి క్షమాపణ చెప్పిన హార్దిక్ పాండ్య.. నిమిషం వ్యవధిలోనే లెక్క సరి!

IND vs SA 1st T20 Highlights: క్యాచ్ వదిలేసి క్షమాపణ చెప్పిన హార్దిక్ పాండ్య.. నిమిషం వ్యవధిలోనే లెక్క సరి!

Galeti Rajendra HT Telugu

09 November 2024, 10:00 IST

google News
  • India vs South Africa 1st T20: రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అప్పటికే ఆ ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టారు. ఆ బాధలో ఉన్న బిష్ణోయ్‌ని అదే ఓవర్‌లో క్యాచ్ వదిలేసి హార్దిక్ పాండ్య మరింత బాధపెట్టాడు. కానీ.. నిమిషం వ్యవధిలోనే బిష్ణోయ్‌ని హార్దిక్ ఖుష్ చేశాడు. 

జాన్సెన్ క్యాచ్‌ని జారవిడిచిన హార్దిక్ పాండ్య
జాన్సెన్ క్యాచ్‌ని జారవిడిచిన హార్దిక్ పాండ్య (jiocinema/Screengrab)

జాన్సెన్ క్యాచ్‌ని జారవిడిచిన హార్దిక్ పాండ్య

దక్షిణాఫ్రికాతో డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఒక క్యాచ్‌ని నేలపాలు చేశాడు. కానీ.. ఆ తర్వాత నిమిషం వ్యవధిలోనే ఆ తప్పిదాన్ని సరిచేసుకున్న హార్దిక్ పాండ్య.. లెక్కని సరిచేశాడు.

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు సంజు శాంసన్ సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా టీమ్ దూకుడుగా ఆడినా వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 17.5 ఓవర్లలో 141 పరుగులకి ఆలౌటైంది. దాంతో 61 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ జట్టు.. నాలుగు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20 మ్యాచ్ ఆదివారం రాత్రి 7.30 గంటలకి జరగనుంది.

టార్గెట్‌గా మారిన బిష్ణోయ్

దక్షిణాఫ్రికా టీమ్ ఛేదనలో ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లే కాదు.. లోయర్ ఆర్డర్ కూడా భారీ షాట్లు ఆడింది. మరీ ముఖ్యంగా.. ఆ జట్టు బౌలర్లు గెరాల్డ్, మార్కో జాన్సెన్ భారీగా సిక్సర్లు కొట్టారు. ఈ ఇద్దరూ భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లు కొట్టారు. అయితే.. గెరాల్డ్ రనౌట్ అవగా.. జాన్సెన్‌‌పై బిష్ణోయ్ రివేంజ్ తీర్చుకున్నాడు.

క్షమాపణలు చెప్పిన హార్దిక్

ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో జాన్సెన్ రివర్స్ స్వీప్‌తో షాట్ ఆడబోయి పాయింట్‌లో క్యాచ్ ఇచ్చాడు. కానీ.. ముందుకు డైవ్ చేస్తూ ఆ క్యాచ్ అందుకోబోయిన హార్దిక్ పాండ్యా.. బంతి చేతుల్లో పడినా నేలపాలు చేశాడు. దాంతో అప్పటికే సిక్సర్లు సమర్పించుకున్న రవి బిష్ణోయ్.. వికెట్ చేజారడంతో చాలా బాధపడుతూ కనిపించాడు. దాన్ని గమనించిన హార్దిక్ పాండ్యా మైదానంలోనే క్షమాపణలు చెప్పాడు.

నిమిషంలోనే తప్పుని దిద్దుకున్న హార్దిక్

ఆ క్యాచ్ చేజారిన తర్వాత బంతిని ఎక్స్‌‌ట్రా కవర్ దిశగా సిక్స్‌గా కొట్టేందుకు జాన్సెన్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. చొరవ తీసుకుని వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లిన హార్దిక్ పాండ్యా ఈసారి ఎలాంటి తప్పిదం చేయకుండా ఆ క్యాచ్‌ని అందుకున్నాడు. దాంతో బౌలర్ రవి బిష్ణోయ్ తన స్టయిల్‌లో సంబరాలు చేసుకున్నాడు.

టీమ్ కోసం డైవ్‌లతో పాండ్య రిస్క్

వాస్తవానికి హార్దిక్ పాండ్యా చాలా మెరుగైన ఫీల్డర్. బంతి ఎక్కువ ఎత్తుకి గాల్లోకి వెళ్లినా.. ఎలాంటి ఒత్తిడి, కంగారు లేకుండా సులువుగా క్యాచ్‌ని హార్దిక్ అందుకోగలడు. అలానే డైవ్ చేస్తూ కూడా క్యాచ్‌లను పడుతుంటాడు. ఒక్కసారి హార్దిక్ చేతుల్లో బంతి పడితే.. అతను కింద పడినా కూడా బంతిని వదలడం చాలా అరుదు.

నిజానికి హార్దిక్ పాండ్యా వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. దాంతో మైదానంలో డైవ్ చేయడం అతనికి అంత సురక్షితం కాదు. కానీ.. క్యాచ్‌ల కోసం హార్దిక్ సాహసం చేస్తుంటాడు. ఈ విషయం తెలిసే.. మ్యాచ్‌లో క్యాచ్ చేజారినా.. అతడ్ని రవి బిష్ణోయ్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కనీసం కోప్పడుతూ కూడా చూడలేదు.

తదుపరి వ్యాసం