తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Siraj Head Fight: భారత్ ఆటగాళ్లతో సిరీస్‌లో ఫ్రెండ్‌షిప్ వద్దు.. గొడవలే ముద్దు.. ఆసీస్ మాజీ క్రికెటర్ సూచన

Siraj Head Fight: భారత్ ఆటగాళ్లతో సిరీస్‌లో ఫ్రెండ్‌షిప్ వద్దు.. గొడవలే ముద్దు.. ఆసీస్ మాజీ క్రికెటర్ సూచన

Galeti Rajendra HT Telugu

11 December 2024, 18:46 IST

google News
  • Mohammed Siraj and Travis Head saga: సిరాజ్, ట్రావిస్ హెడ్ మ్యాచ్‌లో గొడవపడ్డారు. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మళ్లీ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే.. ఇలా ఫ్రెండ్‌షిప్ వద్దని.. గొడవలతో సిరీస్‌లో వేడి మరింత పెంచాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ థామ్సన్ సూచిస్తున్నారు. ఎందుకంటే? 

మహ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్
మహ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్ (AFP)

మహ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ‌ ఆసక్తికరంగా జరుగుతోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. భారత్ జట్టు ఒక మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దాంతో.. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం అవగా.. మూడో టెస్టు మ్యాచ్ డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ ముంగిట ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జెఫ్ థామ్సన్.. కంగారూలకి ఓ ఉచిత సలహా ఇచ్చాడు.

సిరాజ్- హెడ్ మధ్య ఫైట్

అడిలైడ్ వేదికగా గత ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య గొడవ జరిగింది. మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను పదునైన యార్కర్‌తో మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం పెవిలియన్‌కి వెళ్లాలంటూ చాలా కోపంగా సిరాజ్ సైగలు చేయగా.. ట్రావిస్ హెడ్ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత సిరాజ్, ట్రావిస్ హెడ్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కనిపించారు. 

ఐసీసీ సీరియస్

మ్యాచ్ తర్వాత ఈ గొడవ గురించి మీడియా ముందు ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ.. సిరాజ్‌ను తాను ఏమీ అనలేదని.. కేవలం బాగా బౌలింగ్ చేశావ్ అని మాత్రమే చెప్పినట్లు వెల్లడించాడు. కానీ.. సిరాజ్ మాత్రం.. ట్రావిస్ హెడ్ అబద్ధం చెప్పినట్లు ఆరోపించాడు. మొత్తానికి ఈ గొడవ ఇద్దరు క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మందలించే వరకూ వెళ్లింది. మైదానంలో క్రమశిక్షణ తప్పిన సిరాజ్‌కి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతపడింది. అలానే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ చేర్చింది. మరోవైపు ట్రావిస్ హెడ్‌కి జరిమానా పడలేదు. కానీ.. అతని ఖాతాలోనూ ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
 

ఐపీఎల్ కారణంగా ఆస్ట్రేలియా ఆందోళన

వాస్తవానికి భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా సిరీస్‌లో స్లెడ్జింగ్, గొడవలకి దిగడం చాలా కామన్. కానీ.. ఐపీఎల్ కారణంగా.. కొంత మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. భారత్ టాప్ ప్లేయర్‌పై నోరుజారడానికి వెనుకాడుతున్నారు. ఒకవేళ వివాదం పెద్దదైతే.. ఐపీఎల్‌లో తాము ఆడటం కష్టం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో.. అవన్నీ పట్టించుకోకుండా.. ట్రావిస్ హెడ్‌లా ఫైర్‌తో సిరీస్‌లో మ్యాచ్‌లు ఆడాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకి మాజీ ఫాస్ట్ బౌలర్ జెఫ్ థామ్సన్ సూచించాడు.

ప్రేక్షకులకి గొడవలే ఇష్టం

అభిమానులు కూడా భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్నేహంగా మ్యాచ్ ఆడటాన్ని ఇష్టపడరని.. వాళ్లు డబ్బులు చెల్లించి టికెట్లు కొంటున్నారు కాబట్టి.. గొడవల మధ్య పోటాపోటీగా జరిగే మ్యాచ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని జెఫ్ థామ్సన్ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో నియమ, నిబంధనలు తనకి తెలుసునని.. కానీ ప్రేక్షకుడు ఎప్పుడూ యాక్షన్, రియాక్షన్‌ను బాగా ఆస్వాదిస్తారనేది గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు. 
 

తదుపరి వ్యాసం