IND vs AUS 1st Test: పెర్త్ టెస్టు కోసం భారత్ జట్టు మాస్టర్ ప్లాన్.. లాక్‌డౌన్ వాతావరణంలో ప్రాక్టీస్, నో మొబైల్స్
13 November 2024, 14:30 IST
India tour of Australia: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టుకి ప్రాక్టీస్ మ్యాచ్‌ని బీసీసీఐ అరెంజ్ చేసింది. కానీ.. ఆ మ్యాచ్‌ని ఎవరూ చూడకుండా స్టేడియంలో లాక్‌డౌన్ వాతావరణాన్ని సృష్టించింది. దానికి కారణం ఏంటంటే?
భారత టెస్టు జట్టు
భారత్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే.. నవంబరు 22 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుని దాని సొంతగడ్డపై ఓడించాల్సి ఉంది. మొత్తం ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో టీమిండియా ఓడినా.. ఫైనల్ రేసు కష్టమైపోతుంది. కనీసం నాలుగు టెస్టుల్లో గెలిచినా.. ఒక టెస్టుని డ్రాతో సరిపెట్టినా ఫైనల్‌కి చేరవచ్చు.
వైట్‌వాష్‌తో ఒత్తిడిలో భారత్
ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు పర్యాయాలు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సత్తాచాటిన టీమిండియా.. అదే జోరుని ఈసారి కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను సొంతగడ్డపైనే 0-3తో వైట్‌వాష్‌కి గురవడం టీమిండియాని ఒత్తిడిలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ముంగిట ఒక మాస్టర్ ప్లాన్‌ను భారత్ జట్టు తెరపైకి తీసుకొచ్చింది.
వాస్తవానికి నవంబరు 22న పెర్త్‌లో ప్రారంభంకానున్న తొలి టెస్టు కంటే ముందు.. ఇప్పటికే ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ -ఎ జట్టుతో టీమిండియాకి వార్మప్ మ్యాచ్‌లను ఆడించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలుత నిర్ణయించింది. కానీ.. వైట్‌వాష్ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. అక్టోబరు నుంచి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తలపడబోయే భారత్ జట్టు ఒకవేళ అక్కడి ప్రేక్షకుల ముందు వార్మప్ మ్యాచ్ ఆడితే.. జట్టులోని బ్యాటర్ల బలహీనతలు కనిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా జట్టులో యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, సతీశ్ కుమార్ రెడ్డి లాంటి కొత్త ఆటగాళ్లు ఉన్నారు. వీరికి ఇదే తొలి ఆసీస్ పర్యటన. అలానే బౌలింగ్‌లోనూ ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా రూపంలో బౌలర్లు ఉన్నారు.
ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్నా.. నో ఎంట్రీ
ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్‌తో పాటు ప్రాక్టీస్ సెషన్‌ని కూడా సీక్రెట్‌గా ఉంచాలని టీమిండియా నిర్ణయించింది. భారత్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. అలానే టీమిండియా వార్మప్ మ్యాచ్ దృశ్యాలను చిత్రీకరించడానికే కూడా ఎవరినీ అక్కడ టీమిండియా మేనేజ్‌మెంట్ అనుమతించడం లేదు.
స్టేడియంలో లాక్‌డౌన్ వాతావరణం కనిపిస్తోందని ఆస్ట్రేలియా మీడియా వార్తలు రాస్తోంది. ఒకవేళ భారత్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోలు ఆస్ట్రేలియాకి దొరికినా సిరీస్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని టీమిండియా భావిస్తోంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌కి భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకున్నాయి. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. జస్‌ప్రీత్ బుమ్రా భారత్ జట్టుని నడిపించనున్నాడు.
భారత్ టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.