తెలుగు న్యూస్  /  క్రికెట్  /  అంత త్వరగా రిటైర్మెంట్ ఎందుకు? ఐపీఎల్ వేలంలోకి వస్తాడా? తుపానులా ముంచేసిన ఏబీ డివిలియర్స్..41 ఏళ్లలో 41 బాల్స్ లో సెంచరీ

అంత త్వరగా రిటైర్మెంట్ ఎందుకు? ఐపీఎల్ వేలంలోకి వస్తాడా? తుపానులా ముంచేసిన ఏబీ డివిలియర్స్..41 ఏళ్లలో 41 బాల్స్ లో సెంచరీ

Published Jul 25, 2025 12:33 PM IST

google News
  • ఏబీ డివిలియర్స్ ఎందుకు అంత త్వరగా రిటైరయ్యాడు? మళ్లీ ఐపీఎల్ వేలంలోకి వస్తాడా?.. ఇవీ గురువారం అతని బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ కు కలుగుతున్న ప్రశ్నలు. లెజెండ్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఈ సౌతాఫ్రికా దిగ్గజం 41 బంతుల్లోనే సెంచరీ  బాదేశాడు.  
ఏబీ డివిలియర్స్ (WCL screen grab)

ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు ఇది. 360 డిగ్రీల ఆటతీరుతో, మైదానంలో బ్యాటింగ్ విధ్వంసంతో స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ క్రికెటర్ అయిపోయాడు. కానీ అనూహ్యంగా 34 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో బ్యాట్ తో అతని విధ్వంసం చూశాకా.. ఎందుకు త్వరగా ఆటకు వీడ్కోలు పలికావని, ఐపీఎల్ వేలంలోకి వస్తావా? అని అభిమానులు అడుగుతున్నారు.


ఆ లీగ్ లో

లెజెండ్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ (వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్) 2025లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ తరపున ఏబీ డివిలియర్స్ ఆడుతున్నాడు. గురువారం (జులై 24) ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో మ్యాచ్ లో ఏబీ తన వింటేజీ బ్యాటింగ్ స్టైల్ ను ప్రదర్శించాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించి దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టుకు 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

41 బంతుల్లోనే

లీసెస్టర్ లోని గ్రేస్ రోడ్ లో జరిగిన మిస్టర్ 360 డిగ్రీల ప్రదర్శనలో ఏబీని ఎలా ఆపాలో తెలియక ఇంగ్లిష్ బౌలర్లు సతమతమయ్యారు. హషీమ్ ఆమ్లా (29*) మరో ఎండ్ నుంచి సపోర్ట్ ఇవ్వడంతో ఏబీడీ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. 51 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. అసాధారణ స్ట్రోక్ ప్లేతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు.

టాప్ లో టీమ్

డబ్ల్యూసీఎల్ 2025లో దక్షిణాఫ్రికా చాంపియన్స్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ 39 పరుగులతో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2019 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచుకోవడంలో విఫలమై 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టగా, వేన్ పార్నెల్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉండగా, గత మ్యాచ్ లో 30 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు చేసి భారత చాంపియన్స్ బౌలర్లపై తన ఆధిపత్యాన్ని చాటిన డివిలియర్స్ ఇంగ్లండ్ పై ఓపెనర్ గా బరిలోకి దిగి తన అద్భుత ఇన్నింగ్స్ తో ఉర్రూతలూగించాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా చాంపియన్స్ మూడు విజయాలతో డబ్ల్యూసీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.