AIIMS CRE Recruitment : ఎయిమ్స్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ స్టెప్స్ ఫాలో అయి అప్లై చేయండి!
12 January 2025, 19:47 IST
AIIMS CRE Recruitment : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS), న్యూఢిల్లీ కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్(CRE) 2025 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎయిమ్స్‌లో ఉద్యోగాలు
ఎయిమ్స్ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ ఎయిమ్స్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులపై ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. దీని కోసం దరఖాస్తులను ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ aiimsexams.ac.inలో మాత్రమే చేయవచ్చు. జనవరి 31 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
మెుత్తం పోస్టులు
రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 4597 పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. సంబంధిత పోస్టులకు ఫిబ్రవరి 26 నుండి 28, 2025 మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో పరీక్షకు ఒక వారం లేదా మూడు రోజుల ముందు అందుబాటులో పెడతారు.
వయసు
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. SC/ST కేటగిరీకి 5 సంవత్సరాలు, OBCకి 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
పరీక్ష ఫీజు
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 3000 కాగా SC/ST/EWS కేటగిరీ అభ్యర్థులు రూ.2400 చెల్లించాలి. అదే సమయంలో PWD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
AIIMS CRE 2025 కోసం ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకావాలి. దీనిలో మొత్తం 100 బహుళ ఎంపిక ప్రశ్నలు(MCQ) ఉంటాయి. పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి, ఒక్కో భాగంలో 4 మార్కుల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. రెండో దశలో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్ కోసం పిలుస్తారు. పరీక్ష 90 నిమిషాలు ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
- aiimsexams.ac.inలోని ఎయిమ్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఎయిమ్స్ CREపై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ లింక్ అందుబాటులో ఉన్న చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.