తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato To Eternal: జొమాటో కాదు.. ఇప్పుడు 'ఎటర్నల్'.. పేరు మార్చుకున్న క్విక్ కామర్స్ కంపెనీ

Zomato to Eternal: జొమాటో కాదు.. ఇప్పుడు 'ఎటర్నల్'.. పేరు మార్చుకున్న క్విక్ కామర్స్ కంపెనీ

Sudarshan V HT Telugu

Published Feb 06, 2025 06:35 PM IST

google News
  • Zomato to Eternal: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో పేరు మారింది. జొమాటో కంపెనీ పేరును ఎటర్నల్ గా మార్చడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో వెల్లడించారు.

జొమాటో కాదు.. ఇప్పుడు 'ఎటర్నల్' (file image)

జొమాటో కాదు.. ఇప్పుడు 'ఎటర్నల్'

Zomato to Eternal: దీపిందర్ గోయల్ నేతృత్వంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కంపెనీ పేరు మారింది. జొమాటో పేరును ఎటర్నల్ గా మార్చారు. అందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, ఎటర్నల్ అనే పేరును అంతర్గతంగా గత రెండు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా, జొమాటో గురువారం కంపెనీ పేరును "ఎటర్నల్" గా మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ బోర్డు పేరు మార్పుకు ఆమోదం తెలిపిందని, ఈ మార్పుకు వాటాదారులు కూడా మద్దతు ఇవ్వాలని దీపిందర్ గోయల్ గురువారం షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో కోరారు.

వెబ్ సైట్ పేరు మార్పు..

‘‘మా కార్పొరేట్ వెబ్సైట్ కూడా zomato.com నుంచి eternal.com మారుతుంది. మా స్టాక్ టిక్కర్ ను జొమాటో నుంచి ఎటర్నల్ కు మారుస్తాం. జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ అనే నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయి’’ అని దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2007లో కంపెనీ స్థాపించిన 17 ఏళ్ల తర్వాత ‘ఫుడ్ బే’ జొమాటోగా మారిందని, సెన్సెక్స్ లో చోటు దక్కించుకున్న తొలి స్టార్టప్ గా నిలిచిందని గోయల్ గుర్తు చేశారు. గత ఏడాది డిసెంబర్ 23న జొమాటో బీఎస్ఈ సెన్సెక్స్ లోకి ప్రవేశించింది.

డబ్బు కోసం కాదు..

"ఈ ప్రయాణం నాకు మాత్రమే కాదు, మా ఉద్యోగులు, సంస్థాగత పెట్టుబడిదారులు, రిటైల్ వాటాదారులకు అద్భుతమైన సంపదను సృష్టించింది. కానీ నేను డబ్బు సంపాదించడానికి జొమాటోను ప్రారంభించలేదు. నా జీవితంలో ఏదైనా విలువైన పని చేయాలనే కోరికతో దీన్ని ప్రారంభించాను. ఒక వారాంతంలో, నేను పట్టణం చుట్టూ తిరిగాను, టేక్అవే మెనూలను సేకరించి, వాటిని ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేశాను - పూర్తిగా సేవా స్ఫూర్తితో. ఇది వ్యాపారం అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను ఆదాయం కోసం చూడలేదు. నేను సహాయం చేయడానికి ప్రయత్నించాను" అని దీపిందర్ గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.

2 సంవత్సరాల నుండి 'ఎటర్నల్'

2 సంవత్సరాల క్రితం బ్లింకిట్ ను కొనుగోలు చేసిన నాటి నుంచి జొమాటో కంపెనీ పేరును ఎటర్నల్ గా పిలుస్తున్నారని, కంపెనీ పేరుకు, బ్రాండ్ / యాప్ మధ్య తేడాను గుర్తించడానికి అంతర్గతంగా "ఎటర్నల్" (జొమాటోకు బదులుగా) ఉపయోగించడం ప్రారంభించిందని దీపిందర్ గోయల్ రాశారు. ‘‘జొమాటోకు మించిన ఏదో మా భవిష్యత్తుకు ముఖ్యమైన చోదక శక్తిగా మారిన రోజు మేము కంపెనీ పేరును ఎటర్నల్ గా మార్చాలని కూడా మేము అనుకున్నాము’’ అని వివరించారు.

బ్రాండ్ పేరు, యాప్ పేరు మారదు..

అయితే, కంపెనీ పేరు మాత్రమే జొమాటో నుంచి ఎటర్నల్ గా మారుతుందని, బ్రాండ్ పేరు, యాప్ పేరు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని దీపిందర్ గోయల్ స్పష్టం చేశారు. ఎటర్నల్ కంపెనీలో జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ అనే నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయని వివరించారు.

తదుపరి వ్యాసం