Ratan Tata sweet revenge: 3 గంటల పాటు అవమానించినా.. ఔదార్యం చూపి ఆదుకున్న రతన్ టాటా
10 October 2024, 14:29 IST
Ratan Tata sweet revenge: రతన్ టాటా మరణంపై భారత దేశం కన్నీళ్లు పెడుతోంది. భారత పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసి, దేశ ప్రగతిలో కీలక భూమిక పోషించిన టాటా గ్రూప్ విజయ ప్రస్థానానికి ప్రధాన కారణం రతన్ టాటా. అయితే, ఆయన కూడా అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ స్టోరీ ఏంటో ఇక్కడ చూడండి..
రతన్ టాటా
Ratan Tata sweet revenge: భారత్ తన అరుదైన రత్నాన్ని కోల్పోయింది. భారత రత్న రతన్ టాటా మరణంతో ఆయన జీవన ప్రస్థానాన్ని దేశ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే, ఆటో దిగ్గజం ఫోర్డ్ కంపెనీ అధినేత తనను అవమానించి పంపించినా.. ఆ కంపెనీ దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కంపెనీకి చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ లను కొనుగోలు చేసి ఆ సంస్థను రతన్ టాటా ఆదుకున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. సాధారణంగా రతన్ టాటా ను మృదుస్వభావి అయిన పారిశ్రామికవేత్తగానే అంతా భావిస్తారు. కానీ, ఆ ముఖచిత్రం వెనుక బలమైన సంకల్పం కలిగిన నాయకుడు ఉన్నాడు.
టాటా ఇండికా ఫెయిల్యూర్
1998 లో, రతన్ టాటా తన డ్రీమ్ ప్రాజెక్ట్ టాటా ఇండికాను ప్రారంభించారు. ఇది డీజిల్ ఇంజిన్ తో వచ్చిన దేశంలోనే మొదటి హ్యాచ్ బ్యాక్. అయితే, ఇది ఆశించినంతగా విజయవంతం కాలేదు. అమ్మకాలు తక్కువగా ఉండటంతో టాటా మోటార్స్ ను అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ కు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. 1999లో ఫోర్డ్ కంపెనీ అధికారులు ముంబైకి వచ్చి టాటా గ్రూప్ తో చర్చలు జరిపారు. అనంతరం రతన్ టాటా డెట్రాయిట్ లో కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ ను కలిశారు.
మూడు గంటలకు పైగా అవమానం
మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ భారతదేశ ఔత్సాహిక వ్యాపారవేత్త అయిన రతన్ టాటాను దారుణంగా అవమానించారు. ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్ గురించి ఏమీ తెలియనప్పుడు వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించారని రతన్ టాటాను ఎగతాళిగా ప్రశ్నించారు. ‘‘మీకు ఏమీ తెలియదు, మీరు ప్యాసింజర్ కార్ల విభాగాన్ని ఎందుకు ప్రారంభించారు’’ అని బిల్ ఫోర్డ్ వ్యాఖ్యానించారు. ‘మీ కంపెనీని కొనుగోలు చేయడానికి ఒప్పుకోవడమే మీకు మేం చేసే అతిపెద్ద మేలు’’ అని అవమానించారు. టాటా మోటార్స్ (tata motors) కు అతి తక్కువ ధరను కోట్ చేశారు. దీంతో డీల్ క్యాన్సిల్ అయింది.
అవమానంతో ఎర్రబడిన రతన్ టాటా ముఖం
డెట్రాయిట్ నుంచి న్యూయార్క్ కు తిరిగి వచ్చే సమయంలో విమానంలో దాదాపు గంటన్నర పాటు రతన్ టాటా ఏమీ మాట్లాడలేదు. అవమానంతో ఆయన ముఖం ఎర్రబడిపోయింది. భారత్ తిరిగి వచ్చిన తరువాత కూడా ఆ అవమానాన్ని టాటా చాలా రోజులు మర్చిపోలేకపోయారు. టాటా మోటార్స్ ను అమ్మే ప్రసక్తే లేదని ఆయన అప్పుడు నిర్ణయించుకున్నారు. టాటా మోటార్స్ ను అత్యంత లాభదాయక కంపెనీగా నిలపాలని సంకల్పం పూనారు.
9 ఏళ్ల తరువాత..
తొమ్మిదేళ్ల తరువాత, 2008 ఆర్థిక మాంద్యం సమయంలో, ఆటో దిగ్గజం ఫోర్డ్ (FORD) దివాలా అంచున ఉంది. అప్పటికి టాటా మోటార్స్ విజయవంతమైన సంస్థగా అవతరించింది. తన కంపెనీ విభాగాలను ఫోర్డ్ కంపెనీ అమ్మకానికి పెట్టింది. ఆ సమయంలో, ఫోర్డ్ పోర్ట్ ఫోలియోలో జాగ్వార్, ల్యాండ్ రోవర్ అనే రెండు ఐకానిక్ బ్రాండ్లను కొనుగోలు చేయడానికి రతన్ టాటా ముందుకు వచ్చారు. 2008 జూన్ లో 2.3 బిలియన్ డాలర్ల ఆల్ క్యాష్ డీల్ పూర్తయింది. ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ రతన్ టాటాకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘జేఎల్ఆర్ ను కొనుగోలు చేయడం ద్వారా మీరు మాకు పెద్ద మేలు చేస్తున్నారు’’ అని ధన్యవాదాలు తెలిపారు. అలా, రతన్ టాటా స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని 1999 లో రతన్ టాటా (Ratan Tata) తో పాటు ఫోర్డ్ కంపెనీతో చర్చల కోసం అమెరికా వెళ్లిన ప్రవీణ్ కడ్లీ 2015 లో ఒక కార్యక్రమంలో వెల్లడించారు.
టాపిక్