LG Electronics IPO లిస్టింగ్ ఎప్పుడు? పెట్టుబడిదారులకు భారీ లాభాలు పక్కా!
Published Oct 13, 2025 12:15 PM IST
- LG Electronics IPO లిస్టింగ్ ఎప్పుడు? ప్రస్తుత గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది? ఐపీఓ లిస్టింగ్‌పై ఏం సూచిస్తోంది? పెట్టుబడిదారులకు భారీ లాభాలు వస్తాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా స్టాక్ మార్కెట్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ మొదలైంది. సబ్‌స్క్రిప్షన్ విండోలో పెట్టుబడిదారుల నుంచి బలమైన స్పందన లభించిన అనంతరం, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ.. అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్ రోజున ఈ షేరు పనితీరు ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లిస్టింగ్‌కు ముందు గమనించాల్సిన ముఖ్య అంశాలును ఇప్పుడు తెలుసుకుందాము.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ: అలాట్మెంట్, లిస్టింగ్ టైమ్‌లైన్..
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు అక్టోబర్ 10న ఖరారైంది.
ఐపీఓ అలాట్ అయిన వారికి షేర్లు లిస్టింగ్‌కి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 13న వారి డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 7న ప్రారంభమై, అక్టోబర్ 9న ముగిసింది.
అక్టోబర్ 14న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేరు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానుంది.
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత?
లిస్టింగ్‌కు ముందు, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ షేర్ల గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 370 వద్ద ఉంది. ఐపీఓ గరిష్ట ధర బ్యాండ్ అయిన రూ. 1,140 ఆధారంగా చూస్తే, ఈ షేర్లు సుమారు రూ. 1,510 వద్ద బంపర్ లిస్టింగ్‌ని చూసే అవకాశం ఉందని అంచనా. అంటే, ఇది 32% కంటే ఎక్కువ ప్రీమియంతో లిస్ట్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రికార్డు స్థాయిలో సబ్‌స్క్రిప్షన్..
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకు అద్భుతమైన స్పందన లభించింది. ఆఫర్‌లో ఉన్న 7.13 కోట్ల షేర్లకు గాను, ఏకంగా 385 కోట్ల షేర్ల కోసం బిడ్లు వచ్చాయి. ఇది 54.02 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌కు దారితీసింది. ఈ ఏడాది ఈ విభాగంలో అత్యధిక సబ్‌స్క్రిప్షన్లలో ఇది ఒకటిగా నిలిచింది.
వచ్చిన మొత్తం బిడ్ మొత్తం రూ. 4.4 లక్షల కోట్లుగా ఉంది. భారత ఐపీఓల చరిత్రలోనే ఇది అత్యంత భారీ బిడ్‌లలో ఒకటి!
ఈ పబ్లిక్ ఇష్యూలో 10.18 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించారు. ఈ ఐపీఓ ధర బ్యాండ్ రూ. 1,080 నుంచి రూ. 1,140 మధ్య నిర్ణయించడం జరిగింది.
ఆఫర్ చేసిన మొత్తం షేర్లలో, సుమారు 2.03 కోట్ల షేర్లు అర్హత గల సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) కోసం, 1.52 కోట్ల షేర్లు సంస్థాగతేతర పెట్టుబడిదారుల (ఎన్ఐఐ) కోసం, 3.55 కోట్ల షేర్లు రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ చేయడం జరిగింది.
