తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. రూ.6 లక్షల కోట్లు ఉఫ్.. పతనానికి ప్రధాన కారణాలు ఇవే!

Stock Market : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. రూ.6 లక్షల కోట్లు ఉఫ్.. పతనానికి ప్రధాన కారణాలు ఇవే!

Anand Sai HT Telugu

Published Feb 10, 2025 05:02 PM IST

google News
    • Stock Market : స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 548, నిఫ్టీ 178 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ స్టాక్ మార్కెట్‌లు భారీగా నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్లు పడిపోయాయి. ఈ వారంలో మొదటి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు క్షీణించాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం తగ్గి 77,311.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.76 శాతం లేదా 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది.

టాప్ 30 సూచీల్లో టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. 30 షేర్లలో 24 షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ లోని 232 కంపెనీల షేర్లు ఈ రోజు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. 349 కంపెనీలు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మెుత్తం విలువలో సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం కొత్త సుంకాన్ని ప్రకటించడం ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలను పెంచింది. అమెరికన్ వస్తువుల దిగుమతులపై పన్నులు విధించే దేశాలపై కూడా ప్రతీకార చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. మందులు, చమురు, సెమీకండక్టర్లపై సుంకం విధించే అవకాశాన్ని కూడా ఆలోచిస్తున్నారు. గత వారం ప్రారంభంలో అమెరికాకు వచ్చే చైనా వస్తువులపై 10 శాతం సుంకాన్ని ప్రకటించారు ట్రంప్. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది.

సోమవారం భారత రూపాయి 45 పైసలు తగ్గి 87.95కి చేరుకుంది. డాలర్ బలపడటం, స్టాక్ మార్కెట్లో అమ్మకాల కారణంగా రూపాయి ఒత్తిడిలో ఉంది.

కంపెనీల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం లేదు. మార్కెట్ పతనానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఐటీసీ, స్విగ్గీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి కంపెనీల లాభాలు తగ్గాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలహీనపరిచింది. స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచింది.

భారత మార్కెట్ నుండి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) డబ్బును ఉపసంహరించుకునే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు దాదాపు రూ.10,179.40 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. దేశీయ మార్కెట్‌లో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి కారణంగా చెబుతున్నారు.

గమనిక : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. పూర్తి సమాచారం తెలుసునేందుకు సంబంధిత నిపుణుడితో మాట్లాడండి. ఆపైనే పెట్టుబడుల గురించి ఆలోచించాలి.

తదుపరి వ్యాసం